చేయిచేయీ కలిపి.. ఒక్కటై కదిలి..!

ABN , First Publish Date - 2022-07-27T05:25:33+05:30 IST

అధికారులు పట్టించుకోలేదు. పాలకులు హామీలు నెరవేర్చలేదు. ఇక ప్రభుత్వంపై ఆశలు వదిలేసుకున్న రైతులు ఒక్కటై కదిలారు. చేయిచేయీ కలిపి.. చందాలు వేసుకున్నారు. స్వచ్ఛందంగా గ్రోయిన్ల నిర్మాణం చేపట్టారు.

చేయిచేయీ కలిపి.. ఒక్కటై కదిలి..!
గ్రోయిన్ల మరమ్మతులకు ఇసుక బస్తాలను మోస్తున్న మహిళలు

రూ.2 లక్షలు చందాలు వేసుకుని గ్రొయిన్ల నిర్మాణం
ప్రభుత్వంపై నమ్మకం లేక.. స్వచ్ఛందంగా పనులు
(ఇచ్ఛాపురం రూరల్‌, జూలై 26)

అధికారులు పట్టించుకోలేదు. పాలకులు హామీలు నెరవేర్చలేదు. ఇక ప్రభుత్వంపై ఆశలు వదిలేసుకున్న రైతులు ఒక్కటై కదిలారు. చేయిచేయీ కలిపి.. చందాలు వేసుకున్నారు. స్వచ్ఛందంగా గ్రోయిన్ల నిర్మాణం చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం సంభవించిన తితలీ తుఫాన్‌, భారీ వరదలకు బాహుదానది పరివాహక ప్రాంతంలో 3,390 ఎకరాలకు సాగునీరందించే 11 ఓపెన్‌ హెడ్‌ చానల్స్‌ కొట్టుకుపోయాయి. వాటి పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌తో పాటు వివిధ స్థాయి అధికారులను ఆ రైతులు ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినా స్పందన లేదు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు, ఈ ప్రాంతానికి చెందిన జడ్పీ చైర్‌పర్సన్‌ కూడా రైతుల సమస్యను పట్టించుకోలేదు. హామీ ఇస్తున్నా అతీగతీ లేదు. అదిగో.. ఇదిగో అంటూ నాలుగేళ్లపాటు కాలయాపన చేయడమే తప్ప.. ప్రభుత్వం ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా మూడేళ్లుగా ఖరీఫ్‌లో నీరందక బీడు భూమలుగా మారాయి. ఇక ప్రభుత్వంపై నమ్మకం లేక.. డొంకూరు, బూర్జపాడు, పెద్దలక్ష్మీపురం, సన్యాసిపుట్టుగ, కేశుపురం, నీలాపుట్టుగ గ్రామాలకు చెందిన రైతులంతా ఒక్కటయ్యారు. సుమారు రూ.2 లక్షలు చందాలు వేసుకుని.. మంగళవారం గ్రోయిన్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. స్వచ్ఛందంగా ఇసుక బస్తాలు మోసి.. మట్టి పనులు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రొయిన్ల పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతులు దున్న ఆనంద్‌, దున్న సోమేష్‌, దున్న మేఘనాథం, ఎం.భాస్కరరావు, శివంగి భీమారావు తదితరులు కోరుతున్నారు.  

మూడేళ్లుగా పంటలు లేవు
గ్రోయిన్లు మరమ్మతులకు గురవడంతో వచ్చిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసిపోతుంది. అధికారులను అనేక సార్లు కలిసినా ఫలితం లేకపోయింది. కనీసం ఈ ఏడాది మట్టితోనైనా నిర్మించి పంటలకు నీరందించాలన్న ఉద్దేశంతో అంతా ఒక్కటై వచ్చి పనులు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రమను గుర్తించాలి.
- దున్న రామస్వామి, రైతు, డొంకూరు.

చందాలు వేసుకున్నాం
మే నెలలో ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించి అంచనాలు రూపొందించినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. దీంతో రైతులంతా కలసి ఎకరానికి కొంత చొప్పున చందాలు వేసుకుని రూ.2 లక్షలు వరకు వసూలు చేశాం. ఆపై శ్రమదానం చేసి ఇసుక బస్తాలతో తాత్కాళికంగా మరమ్మతులు చేస్తున్నాం.
- ఇరోతు బాలరాజు, రైతు, బూర్జపాడు.
 

Updated Date - 2022-07-27T05:25:33+05:30 IST