జోరుగా వంతెనల నిర్మాణం

ABN , First Publish Date - 2020-04-04T10:42:32+05:30 IST

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌ మహానగర రహదారులపై వా హనాలు రాకపోకలు తగ్గిపోవడంతో..

జోరుగా వంతెనల నిర్మాణం

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో తగ్గిన ట్రాఫిక్‌

వేగం పుంజుకున్న ఎస్‌ఆర్‌డీపీ పనులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌ మహానగర రహదారులపై వా హనాలు రాకపోకలు తగ్గిపోవడంతో.. వంతెనల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. నిబంధనల ప్రకారం కార్మికు లు భౌతిక దూరం పాటిస్తూ చకచకా పనులు చేస్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి పనులన్నింటినీ రాత్రివేళల్లో.. ట్రాఫిక్‌ తక్కువగా ఉన్నప్పుడే చేసేవారు. అది కూడా వాహనాల రాకపోకలను మళ్లించి చేయాల్సి వచ్చేది. కానీ, లాక్‌డౌన్‌ దెబ్బకు అడపాదడపా తప్ప వాహనాలు రోడ్లపైకి రాకపోవడంతో ఈ అవకాశాన్ని అభివృద్ధి పనుల వేగవంతానికి జీహెచ్‌ఎంసీ వినియోగించుకుంటోంది.   మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు పనుల వేగాన్ని పెంచింది. షిఫ్టుల వారీగా 24 గంటలూ పనులు కొనసాగిస్తోంది.రూ.2399 కోట్లతో..హైదరాబాద్‌ స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా రూ.2399 కోట్ల పనులను ప్రభు త్వం మంజూరు చేసింది. అందులో రూ.1500 కోట్ల మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 11 ప్రాంతాల్లో రూ.834 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి రూ.360 కోట్ల బిల్లుల చెల్లింపు పూర్తయింది. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ విభాగం ఇంజనీర్లు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45, ఎల్బీనగర్‌ అండర్‌ పాస్‌, బైరామల్‌ గూడ వంతెన వంటి పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే మూడు, నాలుగు నెలల్లో వీటిని పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్‌, కొత్తగూడ, బహదూర్‌పుర ప్రాంతాల్లోని వంతెన పనుల్లో పురోగతి కనిపిస్తోంది.\


Updated Date - 2020-04-04T10:42:32+05:30 IST