Aug 1 2021 @ 12:00PM

తన తండ్రి పేరిట స్కూల్ నిర్మాణం..సుకుమార్ చేతుల మీదుగా ఓపెనింగ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన ఓ దర్శకునిగానే కాకుండా వ్యక్తిగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కరోనా కష్ట కాలంలో తన సొంతూరిలో భారీ మొత్తంలో ఖర్చు చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ - ఆక్సిజన్ సిలిండర్స్‌ని పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు తన తండ్రి బండ్రెడ్డి తిరుపతిరావు నాయుడు గారి పేరిట తన స్వగ్రామం మట్టపర్రులో నిర్మించిన ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి హాజరవనున్నారని తాజా సమాచారం. 

కాగా సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో 'పుష్ప' అనే పాన్ ఇండియన్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. 5 భాషలలో రూపొందుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.