అనుమతుల పేరిట అడ్డంకులు

ABN , First Publish Date - 2022-08-19T04:19:12+05:30 IST

మారుమూల గిరిజన, అటవీ గ్రామాల్లో రోడ్లు, వంతెనల సౌకర్యం లేక అభివృద్ధికి నోచుకోక బాహ్యప్రపంచానికి దూరంగా గడుపుతున్నారు. గ్రామాల మధ్య రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలమైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. వాగులు పొంగి రహదారులు లేక తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. రోగమొచ్చినా, ప్రసవం కోసమైనా దేవిడిపైనే భారం వేయాల్సిందే.

అనుమతుల పేరిట అడ్డంకులు
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఒర్రెలో నుంచి ద్విచక్రవాహనాన్ని దాటిస్తున్న యువకులు (ఫైల్‌)

- అధికారపార్టీకి తలనొప్పిగా మారిన అటవీఅధికారులు

- రోడ్డు, వంతెనలు పూర్తికాక గిరిగ్రామల ప్రజల అవస్థలు

- వర్షాకాలంలో ప్రతియేటా బాహ్య ప్రపంచానికి దూరంగా పల్లెలు

- ప్రసవం కోసమైనా, రోగమొచ్చినా దేవుడిపైనే భారం

 జిల్లాలో ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి అనేక వ్యయప్రయాసాలకోర్చి నిధులు మంజూరు చేయిస్తే అటవీ అధికారులు మాత్రం అనుమతుల పేరుతో అడ్డుతగులుతున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి గిరిగ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

బెజ్జూరు, ఆగస్టు 18: మారుమూల గిరిజన, అటవీ గ్రామాల్లో రోడ్లు, వంతెనల సౌకర్యం లేక అభివృద్ధికి నోచుకోక బాహ్యప్రపంచానికి దూరంగా గడుపుతున్నారు. గ్రామాల మధ్య రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలమైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. వాగులు పొంగి రహదారులు లేక తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. రోగమొచ్చినా, ప్రసవం కోసమైనా దేవిడిపైనే భారం వేయాల్సిందే. కనీసం గ్రామాలకు ప్రైవేటు వాహనాలు, 108లాంటి వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య పరిస్థితి ఇందుకు చక్కటి ఉదాహరణ. ఈ గ్రామాల మధ్య ఉన్న గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చలించిన సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గ్రామాల మధ్య రోడ్డుతోపాటు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. దీంతో అధికారులు పనులు ప్రారంభించగా అటవీ అనుమతులు లేవన్న కారణంగా అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఇదే ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అటవీ అధికారుల తీరు సంకటంగా మారింది. దీంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలో తెలియక చివరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేలా చేసింది. ఎన్నో దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యంతో పాటు వంతెనలు, సరైనమార్గం లేక ఈ ప్రాంత ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. సమస్య పూర్తికాక, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీతోపాటు ముగ్గురు సర్పంచులు, ఒక్క ఎంపీటీసీ, ఇద్దరు డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేక గ్రామాల్లో తిరగలేక పోతున్నామంటూ ఆవేదన చెందారు. చివరకు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇవ్వడంతో తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.

అనుమతులు లేవంటూ..

బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య రహదారితో పాటు రెండు ఒర్రెలపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం 2018లో పీఎంజీఎస్‌వై కింద రోడ్డు నిర్మాణం కోసం రూ.3కోట్లు, రెండు ఒర్రెలపై రూ.4.25కోట్లు మంజూ రు చేయగా అప్పట్లోనే పనులు ప్రారంభించారు. అటవీ అనుమతులు లేవన్న కారణంగా అటవీశాఖ పనులను అడ్డుకున్నది. పని చేసేందుకు వచ్చిన సిబ్బందిని, యంత్రాలను అక్కడి నుంచి పంపించారు. గత నాలుగేళ్లుగా అనుమతుల కోసం అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా అనుమతులు రాని కారణంగా ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రంగా మారింది. పనులు చేస్తారా లేదా రాజీనామా చేస్తారా అన్న వరకు వెళ్లడంతో చివరకు పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గ్రామాల మధ్య ప్రతి ఏటా వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే సుమారు 12గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెలిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు ఏ చిన్నపాటి రోగం వచ్చినా స్థానికంగా వైద్యం అందడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా సుశ్మీర్‌, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, నాగేపల్లి, చింతలపల్లి, గెర్రెగూడ, పాతసోమిని, బండలగూడ, తలాయి, తిక్కపల్లి, బీమారం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడి అరణ్య రోధన అనుభవిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా రవాణా సౌకర్యానికి నోచుకోక, అభివృద్ధికి దూరంగా కాలం గడుపుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఇటీవల  నాగేపల్లి గ్రామానికి చెందిన కొడ్ప మల్లుబాయి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయం లేక రోడ్డుపైనే ప్రస వించిన విషయం తెలిసిందే. ఇంకా అనేక సందర్బాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా కూడా చోటు చేసుకున్నాయి.

అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించాం

  - దినేష్‌ కుమార్‌, జిల్లా అటవీ అధికారి

కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య రోడ్డుతో పాటు రెండు వంతెనల ఏర్పా టుకు అనుమతుల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఈ గ్రామాల మధ్య అభివృద్ధి పనులకు స్టేట్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు అప్రూవల్స్‌ పూర్తికాగా, నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డుకు నివేదికలు అందజేశాం. అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అటవీ అనుమతులు వస్తేనే పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. 

ఎప్పుడు పూర్తి చేస్తారు

  - ఆలం మనోహర్‌, ఇప్పలగూడ

కుశ్నపల్లి-సోమిని మధ్య ఉన్న రోడ్డు, వంతెనల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారు. రహదారులు లేని కారణంగా గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యానికి నోచుకోక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పనులు పూర్తి చేసేందుకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందో తెలియక అవస్థలు పడుతున్నాం.

Updated Date - 2022-08-19T04:19:12+05:30 IST