నేపాల్‌లో రాజ్యాంగ సంక్షోభం!

ABN , First Publish Date - 2020-12-22T06:06:40+05:30 IST

నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి స్వపక్షంలోని ప్రత్యర్థులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఆదివారం జరిగిన మంత్రిమండలి అత్యవసర...

నేపాల్‌లో రాజ్యాంగ సంక్షోభం!

నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి స్వపక్షంలోని ప్రత్యర్థులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఆదివారం జరిగిన మంత్రిమండలి అత్యవసర సమావేశంలో ఆయన పార్లమెంటు రద్దు ప్రతిపాదన తెచ్చి, కొందరు మంత్రుల తీవ్ర వ్యతిరేకత మధ్యన దానిని ఆమోదింపచేసుకున్నారు. ఓలీ నిర్ణయానికి దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆమోదముద్రవేయడం విశేషం. పార్లమెంటు రద్దు సిఫారసును నిరసిస్తూ పుష్పకుమార్‌ దహల్‌ (ప్రచండ) వర్గానికి చెందిన ఏడుగురు మంత్రులు రాజీనామా చేసినా, ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబడుతున్నా ఓలీ తాను అనుకున్నది చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఓలీ అచ్చం ఓ నియంతలాగా వ్యవహరించారని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై క్రమశిక్షణా చర్యలను సిఫారసు చేసింది. 


పార్లమెంటు రద్దు నిర్ణయం నేపాల్‌ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓలీ, ప్రచండ మధ్య సుదీర్ఘకాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓలీకి వ్యతిరేకంగా ఎవరూ అవిశ్వాసం పెట్టిందీ లేదు, అధికారం వదిలేయమని చెప్పిందీ లేదు. కానీ, తన పార్టీయే తనను నేడో రేపో కుర్చీనుంచి దింపేస్తుందని ఆయనకు తెలుసు. 2015లో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదింపచేసుకొన్న మరో రెండేళ్ళకు నేపాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఓలీ, ప్రచండపార్టీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో సీట్లు రాలేదు. దీంతో వీరిద్దరూ తమ పార్టీలను విలీనం చేసి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా అధికార పంపకానికీ, పార్టీపై పెత్తనానికీ సంబంధించి కుదిరిన ఒప్పందాలు, అవగాహనలు కాలక్రమేణా వీగిపోవడం ఆరంభించాయి. రెండున్నరేళ్ళ తరువాత ప్రచండకు ప్రధాని పదవి అప్పగిస్తానన్న హామీని సైతం ఓలీ కాలదన్నారు. పార్టీ మీద పెత్తనాన్ని సైతం ప్రచండకు వదిలేయకుండా చైర్మన్‌ హోదాలో ఓలీ చక్రం తిప్పుతూ వచ్చారు. పార్టీనీ, ప్రచండనూ ఇరకాటంలోకి నెట్టివేసే రీతిలో ఓలీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువైంది. తనమీద చర్యలు తీసుకుంటే ఊహించని ఉపద్రవాలు తప్పవని ఓలీ హెచ్చరించడంతో మరో రెండువారాల్లో జరగబోయే శీతాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ప్రచండ వర్గం వెనక్కు తగ్గింది. కానీ, ఈ సమావేశాల్లోనే తన పదవికి ముప్పు వాటిల్లవచ్చునని ఓలీ అనుమానించడంతో పార్లమెంటు రద్దుకు సిఫారసు చేసి, దేశాధ్యక్షురాలు తన వర్గం మనిషే కావడంతో ఆమోద ముద్రవేయించుకోగలిగారు. ఎన్నికల కమిషన్‌ సహా వివిధ రాజ్యాంగ పదవుల్లో పూర్తిగా తన వారిని నింపేందుకు వీలుగా, సదరు నియామకాల్లో స్పీకర్‌, ప్రతిపక్షనేతల పాత్ర లేకుండా చేసే రాజ్యాంగ సవరణను ఆయన ఇటీవల ముందుకు తెస్తే ప్రచండ వర్గం అడ్డుకొట్టింది కూడా. ప్రధానిగా, పార్టీ చైర్మన్‌గా నిరంకుశ అధికారాలకోసం ఓలీ చేయని ప్రయత్నమంటూ లేదు. పార్లమెంటు రద్దు నిర్ణయంమీద స్వపక్ష విపక్షాలే కాదు, పౌర సమాజం కూడా మండిపడుతున్నది. ప్రజలు వీధుల్లో నిరసనలు తెలియచేస్తున్నారు. సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలైనాయి. పార్లమెంటు రద్దును అనివార్యం చేసే పరిస్థితులేమీ ఉత్పన్నం కానందున ఓలీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమేనని నిపుణుల భావన. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఏ పార్టీ లేనప్పుడు మాత్రమే ఇలా ఎన్నికలకు పోవాల్సి ఉండగా, ఓలీ స్వార్థంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని పలువురి నమ్మకం. ఓలీ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే, ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ ఆయన అధికారంలో కొనసాగుతారు. పార్లమెంటు రద్దు చెల్లదని న్యాయస్థానం తేల్చినపక్షంలో ఓలీ నిష్క్రమణ, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు జరుగుతాయి. ఒకవేళ ఎన్నికలు జరిగినా, వేరే పార్టీ పెట్టుకొని ఓలీ విస్తృత ప్రచారం చేసుకున్నా మూడేళ్ళక్రితం ఆయనమీద ఉన్న ఆ పాటి విశ్వాసం కూడా ఇప్పుడు ప్రజల్లో లేదనీ, సొంతంగా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Updated Date - 2020-12-22T06:06:40+05:30 IST