Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 01:46AM

వారసత్వ రాజకీయాలతోనే ముప్పు

దేశాన్ని సంక్షోభంలోకి నెట్టనున్నాయవి..  

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా అవే

కుటుంబం కోసం పార్టీ.. సరికాదు

రాజ్యాంగస్ఫూర్తి గాయపడే ధోరణి అది

‘కుటుంబ పార్టీల’పై ప్రధాని దాడి 


న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కుటుంబ వారసత్వ రాజకీయాల వల్ల దేశం సంక్షోభంలో పడనున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబాల ఆధారంగానే రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయన్నారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా తూర్పారబట్టారు. జాతీయ స్థాయిలో గాంధీ-నెహ్రూ కుటుంబంతోపాటు కశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా, ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, తమిళనాడులో స్టాలిన్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణలో కేసీఆర్‌ మొదలైన నేతలను పరోక్షంగా దుయ్యబట్టారు.


‘‘కుటుంబంకోసం పార్టీ, పార్టీని నడిపించే కుటుంబం.. ఇంతకంటే నేనేమైనా చెప్పాల్సిన అవసరం ఉన్నదా? ఒకే కుటుంబం ఒక పార్టీని ఎన్నో తరాలపాటు నడిపించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారివరకు ఉన్న పార్టీలను చూడండి’’ అని వ్యాఖ్యానించారు. అయితే.. కుటుంబంలో ప్రతిభఉన్నవాళ్లు పార్టీలో చేరితే దాన్ని వారసత్వంగా భావించకూడదన్నారు. ‘‘రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావం కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తి గాయపడుతుంది.  అలాంటి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించగలవు?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రజా జీవనంలో అవినీతిపరులను ప్రశంసించడం మానుకోవాలి. వారు చేసిన అవినీతి పునరావృతం కాకుండా సంస్కరణలను తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు.


2015లో కూడా రాజ్యాంగదినాన్ని తొలిసారి జరిపినప్పుడు ప్రభుత్వం నిరసనలను ఎదుర్కొందని, ఇప్పుడు కూడా అవే నిరసనలు ఎదుర్కొంటున్నామంటూ కాంగ్రెస్‌ తదితర పార్టీల నేతల తీరును తప్పుబట్టారు. ‘‘వారెందుకిలా చేస్తున్నారు? కారణం ఏమిటి? దేశానికి ఎన్నో సేవలందించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను గౌరవించాల్సిన వేళ ప్రతిపక్షాల వ్యవహార శైలి ఆయనను అవమానించే విధంగా ఉంది’’ అని దుయ్యబట్టారు. అంబేడ్కర్‌, రాజేంద్ర ప్రసాద్‌, మహాత్మాగాంధీ వంటి మహోన్నత నాయకులు ఎంతో సుదీర్ఘ మదనం తర్వాత రాజ్యాంగం అనే అమృతాన్ని సృష్టించారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి దర్పణమైన ఈ సభకు (పార్లమెంటు) శిరస్సు వంచి ప్రణమిల్లాల్సిన రోజు ఇది అని ఆయన అన్నారు. రాజ్యాంగం కొన్ని వ్యాసాల సంకలనం కాదని, ఈ సహస్రాబ్ది ఘనమైన సంప్రదాయానికి ప్రతీక అని ఉద్ఘాటించారు. అంబేడ్కర్‌ దేశానికి ఇచ్చిన ఒక స్మృతి గ్రంథంగా రాజ్యాంగాన్ని భావించాలన్న ఆయన.. జనవరి 26న రిపబ్లిక్‌ దినంతో పాటు నవంబరు 26న రాజ్యాంగ దినాన్ని జరుపుకోవాలని ఆనాడే నిర్ణయించి ఉంటే బాగుండేదని మోదీ అభిప్రాయపడ్డారు.


స్వాతంత్ర్యోద్యమంలో హక్కులకోసం పోరాడుతూనే మహాత్మాగాంధీ ప్రజలకు తమ విధుల గురించి కూడా గుర్తు చేసేందుకు ప్రయత్నించారన్నారు. స్వాతంత్య్రం తర్వాత ఈ విధులకు ప్రాధాన్యతనిస్తే బాగుండేదని మోదీ అభిప్రాయపడ్డారు. ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్‌’ లో భాగంగా ప్రజలను వారి విధులను గుర్తుచేసే మార్గంలో ముందుకు వెళ్తేనే హక్కులను కాపాడుకోగలమని ఆయన చెప్పారు. సెప్టెంబరు 26న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమరులకు ఆయన నివాళులు అర్పించారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్‌ ఓం బిర్లా, డిప్యూటీ స్పీకర్‌ హరివంశ్‌, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ అసెంబ్లీ చర్చలు, చేతి రాతతో ఉన్న రాజ్యాంగ డిజిటల్‌ ప్రతులను రాష్ట్రపతి  ఈ సందర్భంగా విడుదల చేశారు.


బహిష్కరించిన 14 పార్టీలు

పార్లమెంటులో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సిపీఎం, రాష్ట్రీయ జనతాదళ్‌, శివసేన, ఎన్సీపీ, ముస్లిం లీగ్‌ సహా 14 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్‌ రాజ్యసభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో ఈ పార్టీల నేతలు సమావేశమై కార్యక్రమంలో పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ దినోత్సవం జరపడం హాస్యాస్పదమని ఎన్సీపీ నేత మజీద్‌ మెమన్‌ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసింది బీజేపీయేనని, రాజ్యాంగమంటే మోదీకి గౌరవం లేదని కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాకూర్‌ విమర్శించారు.

Advertisement
Advertisement