Abn logo
Jun 13 2021 @ 07:23AM

డ్రంకెన్‌ డ్రైవ్‌‌లో పట్టుబడ్డ కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 123 వద్ద ఈ నెల 9వ తేదీ రాత్రి డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడ్డ బహద్దూర్‌పురా పోలీస్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అత్తాపూర్‌కు చెందిన వెంకటేశ్‌ బహద్దూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి సమయంలో పిల్లర్‌ నెంబర్‌ 123 అత్తాపూర్‌ వద్ద రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులో పట్టుబడ్డాడు. అయితే తాను తాగలేదని వెంకటేశ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అవసరమైతే బహద్దూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ అధికారులను కనుక్కోవాలని చెప్పాడు. 


అయినా వినకుండా రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు నగర  పోలీస్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం విధులకు హాజరైన వెంకటేశ్‌ చేతులకు సస్పెన్షన్‌ ఉత్తర్వులను అందజేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంటికి వెళ్లాక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం లంగర్‌హౌజ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేశ్‌ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తమకు సమాచారం ఉందని బహద్దూర్‌పురా ఎస్‌ఐ నర్సింహరావు తెలిపారు.