సివిల్స్‌లో కానిస్టేబుల్‌ కుమారుడి సత్తా.. ఐదో ప్రయత్నంలో 516 ర్యాంకు

ABN , First Publish Date - 2020-08-06T18:36:26+05:30 IST

ఏకాగ్రత, పట్టుదల, ధృడ సకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఒక్కసారి విఫలమైతే వెనుకడుగు వేయకుండా ఇష్టంతో కష్ట పడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు వినయ్‌కాంత్‌. సిద్దిపేట స్పెషల్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న

సివిల్స్‌లో కానిస్టేబుల్‌ కుమారుడి సత్తా.. ఐదో ప్రయత్నంలో 516 ర్యాంకు

పట్టువదలని విక్రమార్కుడు వినయ్‌ కాంత్‌

అభినందించిన మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట (ఆంధ్రజ్యోతి): ఏకాగ్రత, పట్టుదల, ధృడ సకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఒక్కసారి విఫలమైతే వెనుకడుగు వేయకుండా ఇష్టంతో కష్ట పడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు వినయ్‌కాంత్‌. సిద్దిపేట స్పెషల్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ దూడం శ్రీనివా్‌స-జయశ్రీ కుమారుడు దూడం వినయ్‌కాంత్‌ సివిల్స్‌లో 516 ర్యాంకు సాధించారు. వినయ్‌కాంత్‌ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు స్థానిక నేతాజీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్‌ గురుకృప జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశాడు. మర్రి లక్ష్మారెడ్డి కళాశాలలో బీటెక్‌లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ను 2013లో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే తండ్రి శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో ఢిల్లీలోని వాజిరం రవి ఐఏఎస్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకున్నాడు. సుమారు ఏడు సంవత్సరాల పాటు ఢిల్లీలోనే ఉంటూ ప్రిపరేషన్‌ కొనసాగించాడు. ఇప్పటివరకు వినయ్‌కాంత్‌ ఐదుసార్లు సివిల్స్‌ పరీక్ష చేశాడు. 


రెండుసార్లు ఇంటర్వ్యూ, ఫిజికల్‌ వెరిఫికేషన్‌ వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఐదోసారి ప్రయత్నించి సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకర్‌గా నిలిచాడు. గతేడాది ఢిల్లీలోని రాజ్యసభ సెక్రటరీ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నాడు. అయినప్పటికీ తనలో సివిల్స్‌ కొట్టాలన్న తపన తగ్గలేదు. ఆ తపనే అతడ్ని విజయతీరాలకు చేర్చింది. వినయ్‌కాంత్‌ చిన్ననాటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభను కనబరిచే వాడు.  స్కూల్‌ టాపర్‌గా, కాలేజ్‌ టాపర్‌గా నిలిచేవాడు. తండ్రి కానిస్టేబుల్‌ కావడంతో పోలీసు ఉద్యోగం పట్ల ప్రేరేపితుడయ్యాడు. తాను కూడా డ్రెస్‌ కోడ్‌ కలిగిన అత్యున్నత ఉద్యోగాన్ని సాధించాలనుకున్నాడు. ఆ దిశగా పట్టుదలతో కష్టపడి చదివి విజయం సాధించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ వినయ్‌కాంత్‌ను అభినందించారు.

Updated Date - 2020-08-06T18:36:26+05:30 IST