చోరీ కేసులో ఓ ఇంట్లో పోలీసుల సోదాలు.. భర్త అరెస్ట్.. అతడి భార్య అభ్యంతరకర ఫొటోలతో ఓ కానిస్టేబుల్ నిర్వాకమిది..!

ABN , First Publish Date - 2021-09-03T19:01:31+05:30 IST

ఆ ఊర్లో ఒక బైక్ చోరీ జరిగింది. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఒక అనుమానితుడి ఇంటికి వెళ్లారు. అతనే దొంగతనం చేసినట్లు తేలడంతో అరెస్టు చేశారు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది.

చోరీ కేసులో ఓ ఇంట్లో పోలీసుల సోదాలు.. భర్త అరెస్ట్.. అతడి భార్య అభ్యంతరకర ఫొటోలతో ఓ కానిస్టేబుల్ నిర్వాకమిది..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఊర్లో ఒక బైక్ చోరీ జరిగింది. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఒక అనుమానితుడి ఇంటికి వెళ్లారు. అతనే దొంగతనం చేసినట్లు తేలడంతో అరెస్టు చేశారు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. అయితే ఈ అరెస్టు సమయంలో సదరు దొంగ భార్య దుస్తులు మార్చుకుంటోంది. అదే అదనుగా భావించిన ఒక కానిస్టేబుల్.. ఆమె ఫొటోలు తీశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టాడు. ఈ విషయంలో పైఅధికారులకు ఆమె ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. భర్తను అరెస్టు చేశాడనే అక్కసుతో తమ కానిస్టేబుల్‌ను ఇరికిస్తోందని ఆ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్ తనకు ఫోన్ చేసినప్పుడు రికార్డు చేసిన యువతి.. ఆ ఆడియోను మీడియాకు అందించింది. దీంతో ఈ ఆడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మొత్తం ఉదంతం బిహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది.


ఇక్కడి అహియాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే రవిరంజన్ అనే కానిస్టేబుల్ ఒక బైక్ చోరీ కేసులో దర్యాప్తు చేస్తున్నాడు. ఒక వ్యక్తి దొంగతనం చేశాడని తెలిసి, ఆ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆ దొంగ భార్య దుస్తులు మార్చుకుంటోంది. అప్పుడు ఆమె ఫొటోలు తీసుకున్న రవిరంజన్.. సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్లు చేస్తే పొటో డిలీట్ చేస్తానని, లేదంటే ఆన్‌లైన్‌లో దాన్ని వైరల్ చేసేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. ఆమె ఈ విషయాన్ని రవిరంజన్ పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తే.. వాళ్లు కూడా సదరు యువతినే తప్పుబట్టారు. చోరీ కేసులో తన భర్తను అరెస్టు చేశాడనే కోపంతో ఆమె నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. అందుకే రవిరంజన్ తనకు ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డు చేసిన యువతి.. దాన్ని మీడియా సంస్థలకు అప్పగించింది. తాను చెప్పినట్లు వినకపోయినా, తెలివితేటలు ప్రదర్శించినా తనకన్నా చెడ్డవాడు ఉండడంటూ రవిరంజన్ బెదిరించడం.. కాల్ రికార్డింగులో స్పష్టంగా వినిపిస్తోంది.

Updated Date - 2021-09-03T19:01:31+05:30 IST