కుట్ర చేశారా...

ABN , First Publish Date - 2022-06-09T06:25:31+05:30 IST

చెమటోడ్చి సేద్యం చేశారు. పెట్టుబడులకు అప్పు చేశారు. క్వింటానికి కేవలం రూ.200 అధికంగా వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ వ్యవస్థలను నమ్మి.. దిగుబడులను అప్పగించారు.

కుట్ర చేశారా...
రైతులకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్‌

దూరంగా ఉన్న సంస్థకు బలవంతంగా బాధ్యత..?

దిగుబడుల సేకరణ అగ్రిమెంట్‌ రాయించి 

ఇచ్చి.. చేతులెత్తేశారు వివరాలు సేకరించలేదా..?

మార్క్‌ఫెడ్‌ అధికారుల  తీరుపై అనుమానాలు

బాధిత రైతుల గోడు పట్టేదెవరికి..?


యల్లనూరు, జూన 8: చెమటోడ్చి సేద్యం చేశారు. పెట్టుబడులకు అప్పు చేశారు. క్వింటానికి కేవలం రూ.200 అధికంగా వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ వ్యవస్థలను నమ్మి.. దిగుబడులను అప్పగించారు. పదుల సంఖ్యలో రైతులు మోసపోయారు. యల్లనూరు, పుట్లూరు మండల రైతులు దగా పడ్డారు. దీని వెనుక అధికారుల నిర్లక్ష్యం, కొందరి కుట్రపూరిత ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. యల్లనూరు మండలంలో మొక్కజొన్న కొనుగోలులో కీలకపాత్ర వహించిన సోమశేఖర్‌ ఎవరు..? ఆ సంఘంలో ఆయన్ను అధికారులే చేర్పించారా..? దీని వెనుక మార్క్‌ఫెడ్‌ వారి హస్తం ఉందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రైతులను మోసగించిన సోమశేఖర్‌ ఎవరో తనకు తెలియదని సహకార సంఘం సీఈవో తులసి అంటున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులే అతన్ని పరిచయం చేశారని, వారి సిఫార్సుతోనే తమ సంఘంలోకి తీసుకున్నామని అంటోంది. అధికారులు ఒత్తిడి చేయడంతో.. రైతులకు డబ్బులు చెల్లిస్తానని అగ్రిమెంట్‌ రాసిచ్చానని తేలిపోతోంది. ఇప్పుడు రైతులకు దిక్కేది..? సోమశేఖర్‌ ఒక్కడే లక్షలాది రూపాయలను దిగమింగేశాడా..? లేక అతన్ని సంఘంలో చేర్పించిన అధికారులకు వాటా ఉందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


ఉన్నారా..? లేదా..?

రైతుల నుంచి పంట దిగుబడులను కొనే సమయంలో మార్క్‌ఫెడ్‌ అధికారులు గాని, ఆర్బీకే సిబ్బందిగాని ఉండాలి. రోజువారీ దిగుబడుల సేకరణ సమాచారాన్ని సేకరించాలి.  కానీ ఆ రెండు మండలాల్లో వివరాలు సేకరించారా, లేదా అన్నది అధికారులు బయటకు చెప్పడం లేదు. మొక్కజొన్న దిగుబడులను కొనుగోలు చేసిన రోజునే మార్క్‌ఫెడ్‌ వారు లారీకి సంబంధించిన ట్రక్‌ షీట్‌ ఆనలైనలో పొందుపరచాలి. అలా చేసుంటే.. లారీ ఎక్కడ అనలోడ్‌ చేసిందో తప్పక తెలుస్తుంది. కొనుగోలు సమయంలో మార్క్‌ఫెడ్‌ ఫీల్డ్‌ సిబ్బంది ఉండాలి. ఆ సమయంలో ఉన్నారా? లేదా? ఉంటే రైతులకు బిల్లులను ఇవ్వని విషయాన్ని ఎందుకు చెప్ప లేదు..? ఇందులో మార్క్‌ఫెడ్‌ సిబ్బందికి కూడా సంబంధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.


ష్యూరిటీ తీసుకోలేదా?

పంట దిగుబడుల సేకరణ బాధ్యతలను ఏదైనా స్వచ్ఛంద సంస్థ, సహకార సంఘానికి అప్పగించే ముందు, ఆ సంస్థ.. లేదా సంఘం నుంచి సీడ్‌లైసెన్స, ష్యూరిటీతో కూడిన అగ్రిమెంట్‌ చేసుకోవాలి. ఈ బాధ్యత మార్క్‌ఫెడ్‌ అధికారులదే. ఇలా ష్యూరిటీ అగ్రిమెంట్‌ అయ్యుంటే రైతులు మార్క్‌ఫెడ్‌ వద్దకు వెళ్లి తమకు జరిగిన అన్యాయం గురించి తెలియజేసినప్పుడు, అగ్రిమెంట్‌ ప్రకారం దిగుబడులను సేకరించిన సంఘం, సంస్థపై చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ దిగుబడులను సేకరించిన శ్రీచైతన్య వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మార్క్‌ఫెడ్‌ అధికారుల మౌనం వెనుక అక్రమాలు కారణమా..? లేక బాధ్యతారాహిత్యమా..? అన్నది తేలాల్సి ఉంది.


ఆ చివర నుంచి..

అనంతపురం జిల్లాకు ఒక చివరన ఉరవకొండ, మరో చివరన యల్లనూరు, పుట్లూరు మండలాలు ఉంటాయి. అక్కడికి, ఇక్కడికి దూరం సుమారు 150 కి.మీ. ఉంటుంది. అంత దూరంలో ఉన్న ఓ సంఘానికి దిగుబడుల కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్‌ అధికారులు అప్పగించారు. ఇది విడ్డూరం. తాము అంత దూరం వెళ్లలేమని చెప్పామని, అయినా బలవంతం చేశారని ఆ సంఘం సీఈవో అంటున్నారు. సేకరణలో సహకరిస్తాడని సోమశేఖర్‌ను వారే తన సంఘంలో చేర్పించారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఇదంతా కుట్రపూరితంగా కనిపిస్తోంది.


చేతులు దులుపుకున్నారా?

నెలల తరబడి తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధిత రైతులు గత ఏడాది జూలైలో  మార్క్‌ఫెడ్‌ కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు అప్పుడే అధికారులు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. రైతుల ఫిర్యాదు తరువాత మార్క్‌ఫెడ్‌ అధికారులు శ్రీచైతన్య సహకార సంఘం సీఈఓను పిలిపించి, రైతులకు డబ్బులు చెల్లించేలా ఆమెతో అగ్రిమెంట్‌ను రాయించి ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబరు 14న ఇది జరిగింది. నెలలోపు పూర్తి డబ్బులు రైతులకు చెల్లిస్తానని అగ్రిమెంట్‌లో ఉంది. కానీ ఈ గడువు దాటి 8 నెలలు గడిచింది. ఇప్పటికీ 12 మంది రైతులకు చెందిన 313.5 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడులకు సంబంధించి సుమారు రూ.6 లక్షలు రావాల్సి ఉంది. డబ్బులు రాకపోవడంతో రైతులు తిరిగి మార్క్‌ఫెడ్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి అధికారులు సహకార సంఘం వద్దకు వెళ్లాలని చెప్పి, చేతులు దులుపుకున్నారని రైతులు వాపోతున్నారు. మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. మార్క్‌ఫెడ్‌ అధికారులు రైతులకు న్యాయం చేయడం అటుంచి, తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకు అగ్రిమెంట్‌ రాయించి ఇచ్చినట్లు కనిపిస్తోంది. అగ్రిమెంట్‌ ప్రకారం గడువులోగా డబ్బులు చెల్లించనందున, చట్టప్రకారం మార్క్‌ఫెడ్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థంగాని పరిస్థితి. దీని వెనుక పెద్దల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. 


వద్దన్నా వెళ్లమన్నారు..

మార్క్‌ఫెడ్‌ డీఎం నన్ను పిలిపించి యల్లనూరులో కొనుగోలు చేయాలని సూచించారు. అంతదూరం వెళ్లి కొనుగోలు చేయలేమని చెప్పాను. కానీ ఆయన తప్పక వెళ్లాలని నాకు సూచించారు. అప్పటివరకు సోమశేఖర్‌ ఎవరో కూడా నాకు తెలియదు. వేరేచోట పనిచేసిన అనుభవం ఉందని మార్క్‌ఫెడ్‌ అధికారులు అక్కడనే పరిచయం చేశారు. దీంతో అతన్ని తీసుకున్నాం. ఐదునెలల తర్వాత అతను చేసిన వ్యవహారం తెలిసింది. మార్క్‌ఫెడ్‌ అధికారుల ఒత్తిడితోనే రైతులకు అగ్రిమెంట్‌ రాయించాను.

- తులసి, సీఈఓ, శ్రీచైతన్య వ్యవసాయ  ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం 


కేసు కట్టలేదు..

దిగుబడులను కొనుగోలు చేసి చాలాకాలమైనా తమకు డబ్బులు ఇవ్వలేదని రైతులు పోలీస్‌ స్టేషనకు వచ్చారు. అయితే వారు పెద్ద మనుషులను పెట్టుకొని మాట్లాడుకుంటాం అని చెప్పి వెళ్లిపోయారు. దీనిపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదు.

- రవి కిరణ్‌, యల్లనూరు ఎస్‌ఐ


Updated Date - 2022-06-09T06:25:31+05:30 IST