Abn logo
Sep 26 2021 @ 00:50AM

సాగును కార్పొరేట్‌కు అప్పజెప్పేందుకు కుట్ర

నల్లగొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విపక్ష నాయకులు

 కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

  జిల్లా వ్యాప్తంగా విపక్ష నేతల డిమాండ్‌

 27న భారత్‌బంద్‌కు పిలుపు

వ్యవసాయాన్ని అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విపక్షనాయకులు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 27న నిర్వహించనున్న భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు. అనేక చోట్ల సభలు,  సమావేశాల్లో మాట్లాడారు.

నల్లగొండ టౌన్‌, సెప్టెంబరు 25 : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని  పక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, న్యూడెమోక్రసి నాయకులు ఇందూరి సాగర్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు సంస్కరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్లతో దేశంలోని 19 ప్రతిపక్ష పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయన్నారు. వ్యవసాయ చట్టాలు అమలు అయితే రైతులు మెడకు ఉరితాడు బిగించుకోవాల్సిందేనని అన్నారు. వ్యవసాయాన్ని అంబాని, ఆదాని లాంటి వారికి, కార్పొరేట్‌ దిగ్గజాలకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. వీటిని ఉపసంహరించుకునేంత వరకు పోరాడాల్సిందేనని అన్నారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రజలంతా సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పాలడుగు నాగార్జున, తుమ్మల వీరారెడ్డి, లొడంగి గోవర్థన్‌, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, మారబోయిన శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 27న చేపట్టనున్న భారత్‌ బంద్‌కు ఆల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ (ఐలూ) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి అనంతుల శంకరయ్య తెలిపారు. పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు బొల్గూరి కిరణ్‌ మద్దతు తెలిపారు.