Abn logo
Sep 19 2021 @ 00:52AM

రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర

అయ్యన్నపై పట్టణ సీఐ స్వామినాయుడుకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

  సీఎం, హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు అయ్యన్నకు తగవు 

 నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం, సెప్టెంబరు 18 : సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అయ్యన్నపాత్రుడు రంగురాళ్లు, గంజాయి, లేటరైట్‌ అక్రమ వ్యాపారాలు చేసి వందల కోట్లు సంపాదించారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో సీఎంపై అయ్యన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పెదబొడ్డేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి అయ్యన్న ఇంటికి ర్యాలీగా బయల్దేరారు. దారిలో అబీద్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించి చంద్రబాబు, అయ్యన్న దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు పెదబొడ్డేపల్లి మదుం సమీపంలో చెరువు ఆక్రమించి షోరూమ్‌ నిర్మించారని ఆరోపించారు. తాళ్లపాలెం లిక్కర్‌ తయారీ ఫ్యాక్టరీ, సన్‌రే రిసార్ట్స్‌లో వాటాలు పొందారన్నారు. 

పట్టణ పోలీసులకు ఫిర్యాదు 

ముఖ్యమంత్రిని అసభ్యకర పదజాలంతో దూషించిన అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులకు ఎమ్మెల్యే గణేశ్‌ ఫిర్యాదు చేశారు. హోం మంత్రి సుచరితతో పాటు మంత్రులు కొడాలి నాని, అనీల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులను వ్యక్తిగతంగా దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, వైసీపీ నాయకులు సన్యాసిపాత్రుడు, కోనేటి రామకృష్ణ,  కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు నాలుగు మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.