కుట్రలు ఛేదించాలి

ABN , First Publish Date - 2020-08-14T08:35:47+05:30 IST

తాము అనుకున్నది నెరవేర్చుకునేందుకు, వ్యవస్థలపై పైచేయి సాధించేందుకు ఏకంగా న్యాయమూర్తులపైనే కుట్రలకు దిగిన

కుట్రలు ఛేదించాలి

న్యాయచరిత్రలోనే ఇదో పెద్ద కుట్రకోణం. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను నిలబెట్టేందుకు కుట్రలను ఛేదించాల్సిందే.


హైకోర్టు సీజేకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది అంత సులభంగా వదిలేసే అంశం కాదు.


ఆ సంభాషణ ప్రకారం హైకోర్టు సీజేకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి తీవ్రమైన కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా సాక్ష్యాలను పంపాలని రామకృష్ణను అడిగారు. ఇలాంటి ఆరోపణలు న్యాయస్థానాలపై 

ప్రజలకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి.


సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి గురించి వాడిన పదజాలం, భాషను తీవ్రంగా పరిగణించాల్సిందే. ఆ సంభాషణ మొత్తం ప్రజల్లోకి వెళ్తే న్యాయ వ్యవస్థపైనే

అపనమ్మకం కలిగిస్తుంది.


ఆ సంభాషణలో ప్రామాణికతను తేల్చేందుకు 

జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ను నియమిస్తున్నాం. ఆయనకు సీబీఐ, ఐబీ సహకరించాలి.

- హైకోర్టు ధర్మాసనం


రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు

సుప్రీం మాజీ జడ్జి జస్టిస్‌ రవీంద్రన్‌తో విచారణ

న్యాయ చరిత్రలోనే అసాధారణ కేసు... తేలిగ్గా వదిలిపెట్టలేం

దేశ న్యాయవ్యవస్థకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు


హైకోర్టు సీజే కు వ్యతిరేకంగా లేఖలు

సుప్రీం జడ్జి లక్ష్యంగా ఆధారాలు అడిగారు

ఇది దురదృష్టకరం, ఏహ్యమైన పరిణామం 

ఆ స్వరం ఆయనదో కాదో నిర్ధారణ జరగాలి

ఇందుకు సీబీఐ, ఐబీ కూడా సహకరించాలి

నమ్మకమే న్యాయ వ్యవస్థకు ప్రాణ వాయువు

దానిని నిలిపే బాధ్యత మాదే: హైకోర్టు


అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తాము అనుకున్నది నెరవేర్చుకునేందుకు, వ్యవస్థలపై పైచేయి సాధించేందుకు ఏకంగా న్యాయమూర్తులపైనే కుట్రలకు దిగిన వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కన్నెర్ర చేసింది. ‘న్యాయమూర్తులపైనే కుట్రలకు దిగుతారా’.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ న్యాయచరిత్రలోనే ఇదో పెద్ద కుట్రకోణమని, న్యాయవ్యవస్థలో ఇదొక అసాధారణమైన కేసు అని పేర్కొంది. ఇలాంటి కుట్రలు న్యాయవ్యవస్థకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను నిలబెట్టేందుకు వీటిని ఛేదించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణ, ఓ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి మధ్య జరిగిన సంభాషణపై వాస్తవికతను, ప్రామాణికతను తేల్చాలని నిర్ణయించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ను నియమించింది. ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చి, నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆయనకు సహకరించాలని సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 


ఆ పిల్‌ వెనుక కుట్ర!

హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ సభ్యుడు లక్ష్మీనరసయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక కుట్ర ఉందని, ఇందుకు తన వద్ద సాక్ష్యాలున్నాయని, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తనతో జరిపిన సంభాషణను పరిశీలించాలని సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణ  ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో పెన్‌డ్రైవ్‌ను, ఆంగ్ల తర్జుమా కాపీని కూడా సమర్పించారు. 

ఆయన ఇంప్లీడ్‌ పిటిషన్‌ స్వీకరణపై విచారణ జరిపిన ధర్మాసనం.. గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఆ ఇద్దరు వ్యక్తుల ఫోన్‌ సంభాషణను పరిశీలిస్తే ప్రాథమికంగా కుట్ర కోణం ఉన్నట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం పేర్కొంది. దీనిని న్యాయవ్యవస్థపైనే కుట్రగా అభివర్ణించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడాలంటే క్షుణ్ణంగా విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నినట్లు అవగతమవుతోందని పేర్కొంది. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే ఇది దురదృష్టకరమైన ఏహ్య సంఘటన అని తెలిపింది. తాము కేవలం ఇంప్లీడ్‌ పిటిషన్‌ ఆధారంగానే ఈ ఆదేశాలు జారీ చేయడం లేదని, హైకోర్టు సీజేకి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేశారని, ఇది అంత సులభంగా వదిలేసే అంశం కాదని స్పష్టం చేసింది.


ముందు పెన్‌డ్రైవ్‌పై తేల్చాలి..

‘ప్రణాళికాబద్ధంగానో, మరోలానో హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసేలా రిటైర్డ్‌ జడ్జి వ్యవహరిస్తున్నారని, దీనిపై వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్‌ ఎస్‌.రామకృష్ణ అభ్యర్థించారు. అయితే ఈ స్థితిలో ఈ అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న సంభాషణ రామకృష్ణది-ఆయన ఆరోపిస్తున్న వ్యక్తిదేనా అన్నది తేలాలి’ అని ధర్మాసనం తెలిపింది. సంభాషణ ప్రకారం హైకోర్టు సీజేకే వ్యతిరేకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి తీవ్రమైన కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. ‘‘అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా సాక్ష్యాలను పంపాలని రామకృష్ణను అడిగారు. ఇలాంటి వ్యవహారాలు న్యాయవ్యవస్థ విశ్వసనీయతపైనే ప్రభావం చూపుతాయి’ అని తెలిపింది.  

నమ్మకమే వెన్నెముక..

‘న్యాయవ్యవస్థకు నమ్మకం వెన్నెముక లాంటిది. అది న్యాయవ్యవస్థకు ప్రాణవాయువు అందిస్తుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి గురించి వాడిన పదజాలం, భాషను తీవ్రంగా పరిగణించాల్సిందే. ఆ సంభాషణ మొత్తం ప్రజల్లోకి వెళ్తే న్యాయ వ్యవస్థపైనే అపనమ్మకం కలిగిస్తుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత హైకోర్టుపై ఉందని పేర్కొంది. ఈ కుట్రను ఛేదించకపోతే ప్రజల్లో న్యాయస్థానాలు విశ్వాసం కోల్పోవచ్చని.. ఈ వ్యవహారాన్ని తేల్చని పక్షంలో ఏదో ఒక రోజు న్యాయవ్యవస్థే కుప్పకూలడం ఖాయమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని.. ఇందుకు విచారణ ఒక్కటే మార్గమని తేల్చిచెప్పింది.


హైకోర్టును కట్టడి జోన్‌గా ప్రకటించలేం..

పలువురు సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణాన్ని కట్టడి జోన్‌గా ప్రకటించాలన్న ఫెడరేషన్‌ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కొవిడ్‌-19 మార్గదర్శకాలను హైకోర్టు రిజిస్ట్రీ తు.చ. తప్పకుండా అమలు చేస్తోందని, అందువల్ల కట్టడి జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కరోనా కేసులు నమోదైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా చేపడుతున్నారని.. ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ప్రత్యామ్నాయ చర్యలను సైతం చేపడుతున్నారని తెలిపింది. కట్టడి జోన్‌గా ప్రకటిస్తే హైకోర్టును మూసివేయాల్సి ఉంటుందని.. కోర్టును మూసేయడమంటే న్యాయం తలుపులు మూసేయడమే అవుతుందంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయాన్ని గుర్తు చేసింది. అదేవిధంగా కేంద్ర పారా మిలటరీ బలగాలతో హైకోర్టు వద్ద కర్ఫ్యూ పెట్టడం సాధ్యం కాదంటూ.. హైకోర్టు స్వతంత్ర సంస్థ అని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదని స్పష్టం చేసింది.


మీడియా చర్చలను నియంత్రించలేం

పిల్‌ దాఖలుచేసిన ఫెడరేషన్‌ తరఫు న్యాయవాది అద్నాన్‌ మహమ్మద్‌ వాదనలు వినిపిస్తూ..  అయితే విచారణ పూర్తయ్యేవరకు మీడియాలో చర్చ జరగకుండా అడ్డుకోవాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం  నిరాకరించింది.  దీంతో ప్రతిరోజూ టీవీల్లో చర్చల్లో పాల్గొనకుండా కనీసం రామకృష్ణనైనా అడ్డుకోవాలని న్యాయవాది కోరగా అందుకూ ధర్మాసనం తిరస్కరించింది. కాగా.. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. సదరు ఫోన్‌ సంభాషణలోని అవతలి వ్యక్తి తరపు వాదనలు కూడా వినాలని కోరారు. సంభాషణ వాస్తవికత తేలితే,  ఆ అంశాన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.  ఇంప్లీడ్‌ పిటిషన్‌లోని కొన్ని అంశాలపై ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువిచ్చింది.  

Updated Date - 2020-08-14T08:35:47+05:30 IST