కరెంట్, బొగ్గు కొరతలో కుట్ర!

ABN , First Publish Date - 2021-10-26T09:28:48+05:30 IST

కరెంటు కొరత గురించి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతున్నది. మోదీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రజలను మభ్యపెట్టచూస్తున్నది. దేశంలో 135 థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి....

కరెంట్, బొగ్గు కొరతలో కుట్ర!

కరెంటు కొరత గురించి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతున్నది. మోదీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రజలను మభ్యపెట్టచూస్తున్నది. దేశంలో 135 థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. దేశానికి అవసరమయ్యే మొత్తం కరెంటులో 70 శాతం వీటి ద్వారానే ఉత్పత్తి అవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొరతను ఇవి ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా విద్యుత్ కొరత తప్పదని భారతీయ కేంద్ర విద్యుత్ అధారిటీ డేటాయే స్పష్టం చేస్తున్నది. బొగ్గు కొరత మూలంగా 135 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 106 ప్లాంట్లు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలు ఉండాల్సి ఉండగా ఇప్పుడు రెండు మూడు రోజులకు మించి నిల్వ బొగ్గులేదు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50 శాతం బొగ్గు సరఫరా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నుండే అందుతుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉత్పత్తి తగ్గుతూ వస్తున్నది. అందుకు మోదీ ప్రభుత్వ విధానాలే కారణం. స్వదేశీ బొగ్గుపై ఆధార పడాలనే పేరుతో కొన్ని బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. వీటి ద్వారా 12.14 కోట్ల బొగ్గు ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్‌ సంస్థలు ఏ కార్యాచరణ చేపట్టకుండా బొగ్గు తవ్వకాలను పక్కన పెట్టి అంతర్జాతీయంగా బొగ్గు ధర తక్కువగా ఉండటంతో దిగుమతులు చేసుకుని లాభాలు గడించాయి. ఫలితంగా దేశంలో గనుల నుంచి తవ్వకాలు పరిమితంగా జరిగాయి. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పిన ప్రభుత్వం, కోల్ ఇండియా సంస్థకు అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. దాని వలన కోల్ ఇండియా సామర్థ్యం మేరకు బొగ్గు త్రవ్వకాలు చేపట్టలేకపోయింది. ఈ గొలుసుకట్టు పరిణామాల ఫలితమే బొగ్గు కొరత. 


విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు కూడా సంక్షోభంలో పడ్డాయి. బొగ్గు కొరతను గమనించిన విదేశీ సంస్థలు బొగ్గు ధరలను విపరీతంగా పెంచాయి. కొన్ని చోట్ల టన్నుకు 60 నుంచి 120 డాలర్లకు పెరిగింది. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుధర 86.68 నుంచి 168 డాలర్లకు ఎగబాకింది. పెరిగిన ధరలు చెల్లించి బొగ్గుకొనేందుకు ప్రభుత్వ సంస్థలకు ఆర్ధిక వనరులు లేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళలో నాలుగు, మహారాష్ట్రలో 13 థర్మల్ కేంద్రాలు మూతపడ్డాయి. పంజాబ్‌లో సగం కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దక్షిణాదిలో అనేక విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. బొగ్గు కొరతను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ ఆధారిత ఉత్పత్తి పెంచుదామన్నా ఆ కేంద్రాలు కూడా గ్యాస్ అందక మూతపడుతున్నాయి. ఓఎన్‌జీసీ, రిలయన్స్ సంస్థల నుంచి వీటికి గ్యాస్ అందించేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలేదు. దేశంలో అక్టోబర్ తొలి వారంలోనే 11.3 శాతం కొరత ఏర్పడింది. గత వారంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 110 ఎంయూల వరకు కొరత ఏర్పడింది. జాతీయస్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’ (పోసోకో) నివేదిక ప్రకారం గత పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కరెంట్ కోత తీవ్ర స్థాయిలో ఉంది. రాష్ట్ర సంస్థలు అధికరేట్లు పెట్టి అయినా విద్యుత్ కొనుగోలుకోసం ప్రైవేట్ సంస్థల దగ్గరకు పరుగుతీసే కుట్రతో ఈ కరెంట్, బొగ్గు కొరత ఏర్పడిందని అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇదే లక్ష్యంతో 1957 నాటి చట్టంలో తేనున్న సవరణద్వారా అరణ్యాలు, గిరిజన భూములను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బొగ్గు తవ్వకాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ఆలోచన మోదీ చేస్తున్నది. ప్రజల అవసరాల పట్ల మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యమిచ్చి బొగ్గు తవ్వకాలు వాటి ద్వారా ఆధికంగా చేయించివుంటే దేశంలో ఈ బొగ్గు కొరత ఇంతగా ఉండేది కాదు. కానీ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్న మోదీ ప్రభుత్వం అలా చేస్తుందని అనుకోవటం అమాయకత్వం. తాజాగా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ప్రైవేటు సంస్థలతో కొనుగోలు, ఒప్పందాలు కదిరిన తర్వాత ప్రభుత్వాలు చేసిన సవరణల వలన ఉత్పత్తి సంస్థలకు కలిగే నష్టాన్ని కారకులైనవారే భరించాలని కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ పేర్కొంది. కొత్త విద్యుత్ నిబంధనలు 2021 (టైమ్ లీ రికవరీ ఆఫ్ కాస్ట్స్ డ్యూ టూ చేంజ్ ఇన్ లా) పేరుతో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ప్త్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం నష్టంగా ఉందని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రద్దు చేసుకుంటే ఆ ప్రైవేటు సంస్థకు సంబంధించిన ఆర్ధిక ప్రయోజనాలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే నెరవేర్చాల్సి ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాడకం రోజుకు 160 మిలియన్ యూనిట్లు. 80 మిలియన్‌ యూనిట్లు జెన్‌కోనుంచి, 40 మిలియన్ యూనిట్లు కేంద్ర ఉత్పత్తి సంస్థల నుంచి, 30 మి.యూ. పవన విద్యుత్ సంస్థల నుంచి, 15 మిలియన్ యూనిట్లు సౌర విద్యుత్ సంస్థల నుంచి, 40 మి.యూ బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు జరుగుతున్నది. నేడు బొగ్గు కొరత వలన జెన్‌కో ఉత్పత్తి 40 మి.యూ., కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి 30 మి.యూ. సప్లయ్ పడిపోయింది. పవన్, సౌర విద్యుత్ గణనీయంగా తగ్గింది. బొగ్గు కొరత వలన జెన్‌కో థర్మల్ పాంట్లలో కొన్ని, గ్యాస్ కొరత వలన ఎనిమిది గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయి.


రాష్ట్ర జెన్ కో థర్మల్ ప్లాంట్లకు సెప్టెంబరులో 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24 వేల టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. ప్రస్తుతం 40 వేల టన్నులుగా ఉంది. రాష్ట్రంలో ఏర్పడిన బొగ్గు కొరతకు ప్రభుత్వానికి ముందు చూపులేకపోవటం ప్రధాన కారణం. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుందన్నట్లు చెప్పి ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సింగరేణి నుంచి బొగ్గును ఏపీ జెన్ కో తీసుకోలేదు. బహిరంగ మార్కెట్లో తమ ఇష్టానుసారం ధరలు ప్రైవేటు సంస్థలు పెంచుతాయన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియంది కాదు. తెలిసీ ప్రైవేటుసంస్థల నుంచి కొనటమనేది ఉద్దేశ పూర్వకంగా జరిగినదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రైవేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే వివిధ ఉత్పత్తి సంస్థలకు 600 కోట్ల వరకు జెన్ కో బాకీ పడిఉండటం కూడా బొగ్గు సేకరణకు అడ్డంకిగా ఉంది.


బొగ్గు, కరెంటు కొరత వ్యవహారంలో ఓ ప్రమాదం దాగి ఉంది. ఈ పేరుతో రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రాయితీ కరెంటును విరమించే అవకాశం పొంచి ఉంది. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇవ్వవద్దన్నదే మోదీ ప్రభుత్వ విధానం. బొగ్గు కొరత, నష్టాల పేరుతో మొత్తం విద్యుత్ వ్యవస్థనే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నది. బొగ్గు, కరెంటు కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమన్నది ప్రజలు గ్రహించాలి. ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలనీ, బొగ్గు సమస్యను వెంటనే పరిష్కరించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమించాలి. 

బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు–రైతు కూలీ సంఘం

Updated Date - 2021-10-26T09:28:48+05:30 IST