కొల్లు రవీంద్ర అరెస్టు వెనుక కుట్ర

ABN , First Publish Date - 2020-07-09T09:21:23+05:30 IST

మాజీమంత్రి కొల్లు రవీంద్రను రాజకీయ కుట్రతోనే అరెస్టు చేశారని ఎంపీ కేశినేని నాని, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ

కొల్లు రవీంద్ర అరెస్టు వెనుక కుట్ర

 కొల్లు కుటుంబానికి ఎంపీ కేశినేని నాని పరామర్శ


మచిలీపట్నం టౌన్‌, జూలై 8 : మాజీమంత్రి కొల్లు రవీంద్రను రాజకీయ కుట్రతోనే అరెస్టు చేశారని ఎంపీ కేశినేని నాని, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ ప్రభుత్వంపై మండిపడ్డారు. కొల్లు రవీంద్ర సతీమణి నీలిమను బుధవారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాలను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారన్నారు.


గద్దె అనూరాధ మాట్లాడుతూ పలుమార్లు జైలుకెళ్లిన జగన్‌ ప్రతిపక్ష నాయకులను కూడా అక్రమంగా జైలుకు పంపుతున్నారన్నారు. అమరావతి రాజధాని కాదంటూనే అదే రాజధానిలో సచివాలయం, హైకోర్టు నడుపుతున్నారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ టీడీపీ నాయకుల అక్రమ అరెస్టుల వల్ల ఇళ్లలో ఉండే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కె.నాగుల్‌మీరా మాట్లాడుతూ జగన్‌ నిరంకుశ పాలన విడనాడాలన్నారు. 


టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ బీసీలను అణగదొక్కే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ కో-ఆర్డినేటర్‌ లింగమనేని శివరామప్రసాద్‌, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు యార్లగడ్డ సుచిత్ర, మాజీ జడ్పీటీసీలు లంకే నారాయణ ప్రసాద్‌, వెంకటేశ్వరరావు, బి.తులసీరావు, వి.శ్రీనివాసరావు, బొప్పన నీరజ, కె.శుభ, టీడీపీ కార్యదర్శి పీవీ ఫణికుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


కార్యకర్తలకు భరోసా ఇద్దాం

కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ భరోసా కల్పించాలని ఎంపీ కేశినేని నాని అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిణామాలపై బుధవారం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఇంటి వద్ద కేశినేని నాని సమీక్షించారు. పార్టీ సీనియర్‌ నాయకులందరూ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు.

Updated Date - 2020-07-09T09:21:23+05:30 IST