మోదీపై కుట్ర

ABN , First Publish Date - 2022-09-22T07:24:11+05:30 IST

గుజరాత్‌ అల్లర్ల అనంతర పరిస్థితులకు సంబంధించిన కేసు మరో మలుపు తిరిగింది.

మోదీపై కుట్ర

గుజరాత్‌ అల్లర్లలో ప్రధానికి శిక్ష పడేలా తప్పుడు పత్రాలు, సాక్ష్యాలు

తీస్తా సెతల్వాద్‌, మరో ఇద్దరిపై అభియోగాలు

అహ్మదాబాద్‌, సెప్టెంబరు 21: గుజరాత్‌ అల్లర్ల అనంతర పరిస్థితులకు సంబంధించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును ముందుకు తీసుకువెళ్లిన సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, రిటైర్డు డీజీపీ ఆర్‌.బి.శివకుమర్‌, మాజీ ఐపీఎస్‌ సంజీవ్‌ భట్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఇరికించడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, ఆయనకు ఉరిశిక్ష పడేలా చేయడానికి వ్యూహం పన్ని నకిలీ పత్రాలు రూపొందించడం, ఆయనను గద్దె దించడానికి జరిగిన కుట్రలో భాగస్వామలు కావడం, తప్పుడు సాక్ష్యాలు ఇప్పించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ అభియోగాలు మోపింది. ఈ మేరకు బుధవారం అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేటు ఎం.వి.చౌహాన్‌కు చార్జిషీటును సమర్పించింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు ఏసీపీ బి.వి.సోలంకి దీన్ని అందజేశారు. గుజరాత్‌ అల్లర్లపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటయిన ‘సిట్‌’.. నరేంద్ర మోదీ సహా 64 మందికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నాయకుడు ఎషాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను జూన్‌ 24న సుప్రీంకొట్టివేసింది. సిట్‌ నిర్ణయం సబబేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా తీస్తా సెతల్వాద్‌, శ్రీకుమార్‌, సంజీవ్‌ భట్‌లపై వ్యాఖ్యలు చేసింది.


తప్పుడు సమాచారం అని తెలిసినప్పటికీ సంచలనం సృష్టించడానికి ఆ ముగ్గురూ కలిసి పనిచేశారని పేర్కొంది. ‘‘నిగూఢ ఉద్దేశాలతో ‘నిరంతరం కుండలో నీరు మరిగేలా’ చేయడానికి ఉద్దేశించిన కుటిల వ్యూహం ఇది. న్యాయప్రక్రియను దుర్వినియోగం చేసే ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొంది.  ఆ వ్యాఖ్యను ఆధారం చేసుకొని గుజరాత్‌ ప్రభుత్వం ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 468 (మోసం కోసం ఫోర్జరీ చేయడం), సెక్షన్‌ 194 (తప్పుడు సాక్ష్యం సృష్టించడం) అన్న నేరాలు మోపింది. అనంతరం తీస్తా, శ్రీకుమార్‌లను అరెస్టు చేసింది. తీస్తాకు మాత్రమే ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లాకప్‌ డెత్‌ కేసులో సంజీవ్‌ భట్‌ ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. దీనివెనుక విస్తృత కుట్ర ఉందని చెప్పడానికి అన్ని కారణాలు ఉన్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ‘సిట్‌’ ఏర్పాటు చేసింది. మొత్తం 6,300 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసినట్టు ఏసీపీ సోలంకి తెలిపారు. 90 మంది సాక్షులను విచారించారు. ఇందులో ప్రస్తుతం న్యాయవాదిగా వ్యవహరిస్తున్న ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ శర్మ, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు శక్తికాంత్‌ గోహిల్‌ ఉన్నారు. 

Updated Date - 2022-09-22T07:24:11+05:30 IST