రాణించకపోతే పక్కన పెడతారు : విరాట్‌కు షోయబ్ అక్తర్ సలహా

ABN , First Publish Date - 2022-04-17T19:00:55+05:30 IST

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022 మంచి జోరుగా కొనసాగుతోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2 సార్లు 40కిపైగా పరుగులు చేశాడు.

రాణించకపోతే పక్కన పెడతారు : విరాట్‌కు షోయబ్ అక్తర్ సలహా

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022 మంచి జోరుగా కొనసాగుతోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2 సార్లు మాత్రమే 40కిపైగా పరుగులు చేశాడు. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పెద్ద ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. చివరి మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆడి 12 పరుగులు మాత్రమే చేశాడు. క్విక్ రన్ కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ స్పందించాడు. స్థిరంగా రాణించకపోతే విరాట్ కోహ్లీని పక్కనపెట్టగలరని హెచ్చరించాడు. కాబట్టి ఆటపై శ్రద్ధ పెట్టాలని, సాధారణ ఆటగాడిగానే తనను తాను భావించుకోవాలని విరాట్‌కి సూచించాడు.


‘‘ ఎవరూ అతీతులు కాదు. అది విరాట్ కోహ్లీ అయినా సరే. ప్రదర్శన చేయకపోతే విరాట్‌ను కూడా పక్కనపెట్టే అవకాశాలున్నాయి. కొన్ని విషయాలను నేను ఇప్పుడే చెప్పదలచుకోలేదు. ఒకటి కాదు.. 10 వేల ఆలోచనలు విరాట్ బుర్రలో తిరుగుంటాయి. కానీ విరాట్ కోహ్లీ చాలా మంచి వ్యక్తి. చక్కటి ఆటగాడు. గొప్ప క్రికెటర్. కానీ ఒకే అంశం ఆటపై మాత్రమే దృష్టిపెట్టాలని విరాట్ కోహ్లీకి నేను సూచిస్తున్నాను. టీవీని పక్కన పెట్టు, జనాల రద్దీని పట్టించుకోకు. ఒక సాధారణ ఆటగాడిగా మాత్రమే నిన్ను నువ్వు భావించుకో. బ్యాటింగ్‌లో పుంజుకో.. నువ్వేంటో చూపించు’’ అని స్పోర్ట్స్ వెబ్‌సైట్ ‘స్పోర్ట్‌కీడా’తో మాట్లాడుతూ షోయబ్ అక్తర్ అన్నాడు. ‘‘ విరాట్ కోహ్లీ ఏకాగ్రతను కోల్పోవాల్సిన అవసరం లేదు. జనాలు ఇప్పటికే విరాట్ కోహ్లీవైపు వేలెత్తిచూపడం మొదలుపెట్టారు. ఈ పరిణామాన్ని ప్రమాదకరమైనదిగానే భావించాలి. విరాట్ దమ్మున్న ఆటగాడు. ధైర్యవంతుడు. చాలా పెద్ద ఆటగాడు’’ అని కొనియాడు. కాగా ఈ సీజన్‌లో విరాట్ అత్యధిక స్కోరు కేవలం 48 పరుగులు మాత్రమే. 

Updated Date - 2022-04-17T19:00:55+05:30 IST