పరుగులకు పగ్గం వేసిన పరిణామాలు!

ABN , First Publish Date - 2022-06-09T06:10:23+05:30 IST

పెరుగుట విరుగుట కొరకే అని అంటుంటారు. నవ్వులు ఎక్కువైతే అవి నువ్వుల దాకా వెడతాయని శాపనార్థాలు పెడుతుంటారు. అవన్నీ తీవ్ర పర్యవసానాలను హెచ్చరించే జీవిత సత్యాలు కావచ్చును కానీ...

పరుగులకు పగ్గం వేసిన పరిణామాలు!

పెరుగుట విరుగుట కొరకే అని అంటుంటారు. నవ్వులు ఎక్కువైతే అవి నువ్వుల దాకా వెడతాయని శాపనార్థాలు పెడుతుంటారు. అవన్నీ తీవ్ర పర్యవసానాలను హెచ్చరించే జీవిత సత్యాలు కావచ్చును కానీ, లోకనీతి, రీతి ఏమిటంటే, అతి మంచిది కాదు, విరగబాటు పనికిరాదు, ఎదురేమున్నదని ఆదమరిస్తే మరేవో ఎదురై బెదిరిపోవలసివస్తుంది.


భారతీయ జనతాపార్టీ అధికారప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీ, భారతప్రభుత్వం ప్రపంచానికి జవాబు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అనేక దేశాలలో భారత రాయబారులను ఆయా ప్రభుత్వాలు పిలిపించి పాఠం చెబుతున్నాయి. మరోవైపు, సర్వ మత సమానత్వం గురించి, భారతీయ సమాజంలోని సహిష్ణుత గురించి, ఈ మధ్య కాలంలో అపచారంగా అపహాస్యంగా మారిపోయిన మాటలు, ఆశ్చర్యకరమైన వ్యక్తుల నోట వినిపిస్తున్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది కొత్త సన్నివేశం. అంతా బాగానే ఉన్నది, ఇదే ఊపులో కాశీ, మధుర మీదుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను దాటగలమని, 2024కు రంగాలంకరణ జరిగిపోతుందని ఆశించారు. కానీ, వేగంలో తూగు ఎక్కువైంది. ఆగి, సాగవలసిన పరిస్థితి.


నిజానికి, నుపుర్ శర్మ నోరుచేసుకోవడానికి ముందే, బిజెపి వేగానికి స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. ప్రతి మసీదు కిందా శివలింగాలు వెదకనక్కరలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ చేసిన హితబోధకు ఎటువంటి నేపథ్యమూ లేదనుకోనక్కరలేదు. ఆందోళన మార్గంతో ప్రారంభించి, కట్టడాన్ని కూల్చి, న్యాయమార్గం ద్వారా రామాలయానికి సానుకూలత సృష్టించుకున్న సంఘ్ పరివార్, అక్కడితో అటువంటి వివాదాలను కట్టిపెట్టాలని మొదట అనుకున్నప్పటికీ, రాజకీయ అవసరాల రీత్యా కాబోలు, వారణాసి, మధుర వివాదాలను కూడా చేపట్టాలని, అయితే న్యాయమార్గంలో లిటిగేషన్ల ద్వారా ప్రయత్నించాలని నిర్ణయించినట్టున్నది. అందులో భాగంగా కోర్టును ఆశ్రయించిన వివాదాలలో జ్ఞానవ్యాపి ఒకటి. అక్కడ వీడియో పరిశీలనలో శివలింగాన్ని పోలిన ఆకృతి లభించిందన్న వార్త కుతూహలం కలిగించినప్పటికీ, ఊహించినంత సంచలనం కనిపించలేదు. రెండు వివాద స్థలాలూ ఉత్తరప్రదేశ్‌లో ఉండడం, అక్కడ ఎన్నికలేవీ లేకపోవడం, ఎన్నికలు ఉన్నచోట ఓటర్లను ఈ వివాదాలు పెద్దగా ప్రభావితం చేసే సూచనలు కనిపించకపోవడం, ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన సూచన వెనుక పనిచేసి ఉండవచ్చు. కర్ణాటకలో ఇటీవలి వివాదాలు, త్వరలో ఎన్నికలు జరిగే అనేక రాష్ట్రాలలో బుల్‌డోజర్ వినియోగం, పరిస్థితులను అదుపు తప్పేలా చేస్తున్నాయేమోనన్న ఆందోళన కూడా సంఘ్ పరివారానికి ఉండవచ్చు. లేదా, ఎజెండాను ముందుకు తీసుకువెళ్లే విషయంలో కొంచెం వెనుకకు తగ్గాలని బిజెపి రాజకీయశ్రేణులే ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వాన్ని అభ్యర్థించాయా తెలియదు. క్షేత్రస్థాయి అంచనాలు రాజకీయ సంస్థకే మెరుగుగా ఉండే అవకాశం ఉన్నది.


ఒక అడుగు వెనుకకు వేసిన స్థితిలో నుపుర్ శర్మ వివాదం వచ్చింది. దేశంలో ముస్లిములతో ముడిపడిన అనేక వివాదాల విషయంలో నోరువిప్పని ఇస్లామిక్ దేశాలు ప్రవక్త విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించాయి. ముస్లిముల జీవనోపాధి మీద, నివాసహక్కుల మీద, వేషభాషల మీద అనేక తీవ్ర సమస్యలు ఎదురైనా, వాటిని భారత్ అంతర్గత అంశాలుగా పరిగణించి ఉండవచ్చు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు మతాన్ని స్పృశించినవి కావడంతో, సరిహద్దులతో నిమిత్తం లేకుండా నిరసనలు వెల్లువెత్తాయి పాకిస్థాన్ మినహాయించి, అనేక ఇస్లామిక్ దేశాలు భారత్‌కు మిత్రదేశాలు. దాదాపు కోటి మంది భారతీయులు ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశాలలో పనిచేస్తున్నారు. మన దేశంలోని పారిశ్రామిక, ఆర్థికరంగాలకు గల్ఫ్‌, అరబిక్ దేశాలతో గాఢమైన అనుబంధం ఉన్నది. భారతదేశ ఎగుమతులు అనేకం ఆయా దేశాలకు ఉద్దేశించినవే. అంతటి కీలకమయిన దేశాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పడంతో భారతప్రభుత్వం వెనుకకు తగ్గవలసి వచ్చింది. ఆమెను, మరొకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, వారిద్దరినీ ‘అణాకానీ’ మనుషులని తీసిపారేశారు. వారు అప్రధానమైన వారయితే, అసలు ఆ దేశాల నుంచి అంత అభ్యంతరం వచ్చేదే కాదు. భారతదేశాన్ని పాలిస్తున్న అధికారపార్టీ ప్రతినిధులు కాబట్టే, అంత తీవ్రమయిన నిరసన వచ్చింది. పార్టీ వారిమీద చర్య తీసుకున్నది సరే, మరి ప్రభుత్వం ఏమి తీసుకున్నది? అన్న ప్రశ్న వస్తున్నది. దేనికీ వెరవని, జంకని, దృఢమైన సంస్థగా చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వానికి విదేశాల నిరసనలకు విలువనిచ్చి తన పార్టీ ప్రతినిధుల మీద చర్య తీసుకోవడంకానీ, రాయబారుల ద్వారా అందరికీ సంజాయిషీలు ఇవ్వడం కానీ ఏమంత గౌరవం కాదు. జరిగిన తప్పు నుంచి మర్యాదగా బయటపడాలని తాను ప్రయత్నిస్తున్నది కానీ, ఈ లోగా, రాజకీయ అభిమానుల దృష్టిలో పూర్వపు ప్రతిష్ఠను కోల్పోతున్నది. ఇప్పుడు, ప్రపంచమంతా దుర్భిణీ వేసుకుని భారత్ మాటలను, చేతలను చూస్తున్నది. కొంత కాలం దాకా, భారతీయ జనతాపార్టీలో పాత దూకుడు కనిపించడం కష్టం. మత జాతీయతకు నాలుగు రోజులు సెలవు!


తెలంగాణ రాష్ట్రసమితికి ఎదురైన సంకటం వేరు. దివాళా తీసిన ఖజానా, అప్పులు ఇవ్వని కేంద్రం.. వీటిని ఎట్లాగో సర్దుబాటు చేసుకోవచ్చును కానీ, బిజెపి నుంచి ముంచుకువస్తున్న రాజకీయ ప్రమాదమే ఆ పార్టీకి కలవరం కలిగిస్తున్నది. కాసేపు కాంగ్రెస్‌ను, కాసేపు బిజెపిని శత్రువులుగా పరిగణించి, ఆ ఇద్దరినీ సమతూకంలో పెరగనిచ్చి ఓట్ల చీలికతో గట్టెక్కవచ్చునన్న వ్యూహం చెల్లుబాటు కాదేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. జంటనగరాల మున్సిపల్ కార్పొరేటర్లను కలుసుకుని ప్రధాని బుద్ధులు చెప్పడం కానీ, వచ్చే నెలలో పార్టీ అగ్రనాయకత్వ పటాలం అంతా హైదరాబాద్‌లో డేరా వేయడం కానీ, బిజెపి సీరియస్నెస్‌ను సూచిస్తున్నాయి. ఫామ్ హౌస్‌లో చింతాముద్రలో ఉండే కెసిఆర్, ఇటువంటి ప్రమాదాలన్నిటికీ విరుగుడు రచిస్తూ ఉంటారని, భయపడనక్కరలేదని టిఆర్ఎస్ శ్రేణులు తమకు తాము ధైర్యం చెప్పుకుంటున్నారు కానీ, అభద్రతాభావపు కుదుపు తెలంగాణ ప్రభుత్వానికి అనుభవంలోకి వస్తున్నది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు, ప్రదర్శించిన తొట్రుబాటు ప్రజలలో కలిగించిన అభిప్రాయాలు టిఆర్ఎస్‌కు సానుకూలమైనవి కావు. తెలంగాణ ప్రభుత్వం గురించి, టిఆర్ఎస్ గురించి బిజెపి ఎటువంటి రాజకీయ కథనాన్ని వ్యాప్తిలో పెట్టిందో సరిగ్గా అందుకు అనుగుణమైన పరిణామాలు ఈ సంఘటనలో జరిగాయి. అత్యాచారంలోని దుర్మార్గం, బీభత్సం, సామాజిక సంస్కారాల క్షీణత మొదలయినవి సరే, కానీ, దోషుల గురించిన సమాచారం జనంలో చెలామణి అవుతుండగా, తగిన చర్య తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం మీనమేషాలు లెక్కించడంలో పనిచేసిన సంకోచాలు, రాజకీయ గణితాలు ఏమిటి అన్నవి ప్రశ్నలుగా ముందుకు వచ్చాయి. ఇదే పోలీసు యంత్రాంగం కదా, దిశ అత్యాచారం సంఘటనలో ఇరవై నాలుగు గంటల లోపు దోషులను పట్టుకున్నది, ఆలస్యం చేయకుండానే తమ పద్ధతిలో ‘న్యాయం’ చేసి, ఆ తరువాత విచారణ కమిషన్ ముందు దోషులుగా నిలబడింది? కమిషన్ నివేదిక చెప్పినట్టు, ముగ్గురు మైనర్లతో సహా నలుగురిని ఎన్‌కౌంటర్ చేసి, పూలవానలు కురిపించుకున్న శాంతిభద్రతల యంత్రాంగం, ప్రస్తుత ఘటనలో మైనర్లు ఉన్నారని సున్నితంగా వ్యవహరించవలసి వచ్చిందని చెబుతున్నప్పుడు అది జనానికి ఏ రకంగా అర్థమవుతుంది? బాధితుల పట్లా, నేరం నిరూపితమయ్యే దాకా నిందితుల పట్ల కూడా చట్టం, ప్రభుత్వం సున్నితంగానే వ్యవహరించాలి. ఒక సంఘటనతో సమాజం కలవరపడినప్పుడు, ఎటువంటి రాజీ లేకుండా భద్రతకే కట్టుబడతామన్న భరోసాను ప్రభుత్వం ఇవ్వాలి. ప్రజలలో భద్రతాభావాన్ని కల్పించలేకపోవడంలో, ప్రభుత్వంలోని రాజకీయ అభద్రత పనిచేసింది. ఇట్లా తడబడడం మొదలయ్యాక, ఇక అది ఆగదు. పెక్కు భంగులు... సంపాతముల్!


రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్ష, జాతీయ అధికారపార్టీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలు... ఈ రెండిటి మీదనే టిఆర్ఎస్ వ్యూహం ఆధారపడి ఉన్నది. నుపుర్ శర్మ వివాదంలో కేంద్రం వైఖరిని టిఆర్ఎస్ యువనేత కెటిఆర్ తప్పుపట్టిన పద్ధతి బాగున్నది. కానీ, ఒక దారుణ అత్యాచారం విషయంలో ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం అనుసరించిన వైఖరి, టిఆర్ఎస్ మతతత్వ వ్యతిరేక వైఖరినే ప్రశ్నార్థకం చేసింది. అధికార ప్రాపకం ఉన్నవారి నేరాల విషయంలో సమస్త వ్యవస్థలూ ఉదాసీనంగా ఉండడం, ప్రభుత్వంలో అనధికార భాగస్వామిగా ఉన్న మైనారిటీ రాజకీయ పక్షం విషయంలో మాత్రమే జరగలేదు. అధికారపార్టీ చుట్టూ అలుముకుని ఉన్న క్రీనీడల్లో నవసంపన్నత సృష్టించిన వికృత వ్యవహారాలు ఎన్నో కనిపిస్తాయి. ఓట్ల సమీకరణ, సేకరణ విధానం ద్వారా విజయాలను నిర్వహిస్తూ వస్తున్న అధికారపార్టీ, క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థానాల దాకా ఏ ఉదాత్త సంస్కృతిని, ప్రజానుకూల విలువలను ప్రోత్సహించిందని? సిద్ధాంత బలమూ, నైతిక శక్తీ లోపించిన ఈ శ్రేణులు, రేపు తమ ప్రభుత్వాన్ని కాపాడుకోగలవా? జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండాను రచించుకోగలవా? జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన విషయంలో జరిగినట్టు, రాజకీయ ప్రత్యర్థులు అడుగడుగునా నిలదీస్తే, ముందరికాళ్లకు బంధం వేస్తే నిలబడగలవా?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-06-09T06:10:23+05:30 IST