నష్టపోయిన రైతులకు పరిహారం

ABN , First Publish Date - 2020-11-29T06:36:12+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు డిసెంబరు ఆఖరు నాటికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

నష్టపోయిన రైతులకు పరిహారం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని, వేదికపై మరో మంత్రి సురేష్‌, కలెక్టర్‌ భాస్కర్‌

వచ్చేనెలాఖరుకు  ప్రక్రియ పూర్తి 

మంత్రి బాలినేని

ఒంగోలు (కలెక్టరేట్‌): నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు డిసెంబరు ఆఖరు నాటికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్‌లోని స్పందన భవన్‌లో తుఫాన్‌ నష్టాలపై పలు శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తక్షణమే పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. వెంటనే దెబ్బతిన్న పంటలను గుర్తించి డిసెంబరు 15వతేదీలోపు నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఎవరు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులే బాఽధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన గ్రామాల్లో  పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన పంటలతో పాటు గెదేలు, గొర్రెలు, మేకలను కూడా నమోదు చేయాలన్నారు. విద్యాశాఖమంత్రి సురేష్‌ మాట్లాడుతూ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ ఈనాం భూములు, వెబ్‌ ల్యాండింగ్‌లో లేని భూముల్లో కూడా పంట నష్టాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. నష్టం సర్వే పక్కాగా చేపట్టాలన్నారు. మగ్గాలు నీట మునగడంతో నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.కనకారావు, జేసీలు జె. వెంకటమురళి, టి.ఎస్‌.చేతన్‌, కె. కృష్ణవేణి, డీఆర్వో కె.వినాయకం, జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T06:36:12+05:30 IST