Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 25 May 2022 00:02:31 IST

కనెక్షన్‌.. కలెక్షన్‌..

twitter-iconwatsapp-iconfb-icon

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రైతుల పడిగాపులు
డీడీ చెల్లించి ఏడాడవుతున్నా కలుగని మోక్షం
కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు
ముడుపులు.. పైరవీ చేసిన వారికే కనెక్షన్లు మంజూరు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 20 వేల దరఖాస్తులు పెండింగ్‌


వ్యవసాయ భూముల్లో కొత్త విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. డీడీలు చెల్లించినా విద్యుత్‌లైన్లు రావడం లేదు. సీనియారిటీ వారీగా కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉన్నా చేయి తడిపినవారికి, పైరవీలతో వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలున్నాయి. విద్యుత్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ లేమి, కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తి సమస్యలకు కారణమవుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హనుమకొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తుండడంతో రైతులు చిన్న చిన్న కమతాలను కూడా సాగులోకి తెచ్చి బోర్లు వేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం చెరువులు, కుంటలను ఆధునీకరించడంతో నీటి లభ్యత పెరిగింది. ఇది వరకు కేవలం వర్షాధారం మీదనే పంటలు పండించగా ప్రస్తుతం నీటి వనరులు అందుబాటులోకి రావడంతో బోర్లు, చెరువుల ద్వారానూ పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం ఎక్కువగా ఉంది. అయితే మోటార్ల సంఖ్య పెరిగి లోడుకు తగ్గట్టు ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం  కూడా పెరుగుతోంది. దీంతో విద్యుత్‌ కనెక్షన్ల కోసం రైతులు ఎగబడుతున్నారు.

దరఖాస్తులు

ఎల్‌టీ లైను లాగి వ్యవసాయ పంపుసెట్టుకు కనెక్షన్‌ ఇవ్వాలన్నా, ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు పంపుసెట్టుకు కనెక్షన్‌ ఇవ్వాలన్నా రైతులు విద్యుత్‌ శాఖకు రూ.5,787 డీడీ కట్టాలి. పొలానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, అధార్‌కార్డులు జిరాక్స్‌ ప్రతులు, రెండు పాస్‌ఫొటోలతో మీ సేవా కేంద్రం లేదా విద్యుత్‌శాఖ సమీకృత వినియోగదారుల సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత లైన్‌మెన్‌తో కలిసి ఏఈ క్షేత్ర పరిశీలన చేసి, దరఖాస్తు చేసిన రైతు పొలానికి ఎన్ని స్తంభాలు అవసరం అవుతాయి. ఎన్ని మీటర్ల కండక్టర్‌ వైరు లాగాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ తీసుకువచ్చేందుకు అవసరమయ్యే రవాణా ఖర్చు తదితర వివరాలతో అంచా వేసి విద్యుత్‌ శాఖకు రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన నెల రోజుల్లోపు కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రాధాన్యతా క్రమం..

2016 జనవరి నుంచి మొదట దరఖాస్తు చేసుకున్నవారికి మొదట అనే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ విధానం ప్రకారం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ముందు దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలి. పౌరసేవల పట్టిక ప్రకారం దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే జారీ చేయాలి. గ్రామాల వారీగా సీనియారిటీ జాబితాను రూపొందించి కార్యాలయం వద్ద ప్రదర్శించాలి. ఈ నిబంధనలు ఎక్కడా అమల్లో కనిపించడం లేదు. తేదీల వారీగా వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించకుండా కాలాయాపన చేస్తున్నారు.

ముడుపులిస్తేనే..
కొత్త కనెక్షన్ల కోసం కార్యాలయాలకు వచ్చే రైతులు నుంచి కొందరు విద్యుత్‌ అధికారులు, సిబ్బంది మామూళ్లు దండుకుంటున్నారు. సిఫార్సులు, పైరవీలతో పాటు చేతులు తడిపినవారికే ముందస్తుగా కనెక్షన్లు ఇస్తున్నారు. లేకుంటే దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. రాజకీయ నేతలు సిఫార్సు చేసినవారికి ముందుగా ఇస్తున్నారు. సాధారణ రైతులు మాత్రం నెలలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్లు ఇంకా ఇతర మెటీరియల్‌ కావాలంటే కూడా రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్‌వీడీఎ్‌స పథకం ద్వారా ఉచితంగా నెలకొల్పాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లకు సైతం రైతుల నుంచి కనెక్షన్లకు  ఓ రేటు కట్టి ఒక్కో గ్రామంలో రూ.లక్షల్లో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి.

పెండింగ్‌లో దరఖాస్తులు

ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 16 సర్కిళ్లు ఉన్నాయి. వీటి నుంచి కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 20వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో  7,500 వరకు మంజూరు లేక రెండేళ్లుగా మూలుగుతున్నాయి. వీటిలో జనగామ, మహబూబూబాద్‌ జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

పారదర్శకంగా కనెక్షన్ల మంజూరు
- గోపాల్‌రావు, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ

ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులు 20వేల వరకు ఉన్నాయి. అయితే ఇవన్నీ నాలుగైదు నెలల్లో అందినవే.. వీటిని కూడా వచ్చే మూడు నాలుగు నెలల్లో పరిష్కరిస్తాం. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల జారీ పారదర్శకంగా జరుగుతోంది. నిబంధన మేరకు కొత్త వ్యవసాయ కనెక్షన్లు జారీ చేస్తున్నాం. ఎక్కడా పైరవీలకు తావు లేదు. క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బందులకు గురిచేసినట్టు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.