కలసాకారం

ABN , First Publish Date - 2022-06-02T04:51:29+05:30 IST

వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి జిల్లా కోర్టు రావాలన్న కక్షిదారులు, న్యాయవాదుల ఆకాంక్ష నేడు సాకారం కాబోతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్‌బీ నగర్‌లో కొనసాగుతూ రాగా, నూతన జిల్లాల ప్రకారం కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థన మేరకు రాష్ట్ర హైకోర్టు కొంత కాలంగా సుదీర్ఘ కసరత్తు చేసింది. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కలసాకారం

  •  జిల్లా ప్రజలకు అందుబాటులోకి ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు సేవలు
  •  నేడే  వర్చువల్‌గా సీజేఐ చేతుల మీదుగా ప్రారంభం
  •  సాకారం కానున్న జిల్లా ప్రజల ఆకాంక్ష
  •  రాబోయే రోజుల్లో మరిన్ని కోర్టులు వచ్చే అవకాశం

వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి జిల్లా కోర్టు రావాలన్న కక్షిదారులు, న్యాయవాదుల ఆకాంక్ష  నేడు  సాకారం కాబోతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్‌బీ నగర్‌లో కొనసాగుతూ రాగా,  నూతన జిల్లాల ప్రకారం కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలన్న  అభ్యర్థన మేరకు రాష్ట్ర హైకోర్టు కొంత కాలంగా సుదీర్ఘ  కసరత్తు  చేసింది. కొత్త జిల్లా కేంద్రాల్లో   జిల్లా కోర్టుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజైన గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ను   ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. 

వికారాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ ప్రాంత ప్రజలకు అయిదు దశాబ్దాలుగా న్యాయ సేవలు అందుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టులు ఎల్‌బీ నగర్‌ కొత్తపేటలో కొనసాగుతుండగా, జిల్లా కోర్టుల్లో కొనసాగే కేసులకు హాజరయ్యేందుకు జిల్లా ప్రజలకు దూరభారం తప్పలేదు. బషీరాబాద్‌ మండలానికి చెందిన కక్షిదారులు జిల్లా కోర్టుల్లో కొనసాగుతున్న కేసులకు హాజరు కావాలంటే సుమారు 240 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాల్సి వచ్చేది. జిల్లా కోర్టులోని కేసులకు హాజరు కావాలంటే సమయంతో పాటు ఖర్చులు కూడా భరించాల్సి వచ్చేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొత్త రెవెన్యూ జిల్లాలు ఏర్పాటు చేసినా ఇంత వరకు కోర్టుల విభజన జరగలేదు. రాష్ట్ర హైకోర్టు కొంత కాలంగా సుదీర్ఘ కసరత్తు చేసి కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు  గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వీ రమణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కలిసి ప్రారంభించనున్నారు. వికారాబాద్‌ జిల్లా కోర్టు భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మిసిస్ట్రేటివ్‌ జడ్జి ఎం.గిరిజా ప్రియదర్శిని, అసోసియేషన్‌ స్థానిక, జిల్లా పరిధిలోని కోర్టుల జడ్జిలు, మెజిస్ట్రేట్లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, బార్‌ కౌన్సిల్‌, అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిసింది. 

1969లో మున్సిఫ్‌ కోర్టు సేవలు ప్రారంభం

వికారాబాద్‌లో 1969లో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సేవలు ప్రారంభమయ్యారు. కోర్టు భవన నిర్మాణానికి 1979, నవంబరు 14న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చల్లా కొండయ్య శంకుస్థాపన చేయగా, సబార్డినేట్‌ జడ్జి కోర్టు (ప్రస్తుత కోర్టు సముదాయం) భవనాన్ని 1984, జూన్‌ 4వ తేదీన అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వై వీ చంద్రచూడ్‌ ప్రారంభించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన నిర్మాణం పనులకు 2004, జనవరి 7న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వీ రమణ శంకుస్థాపన చేయగా, ఆ భవనాన్ని 2005, జనవరి 12న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టును 2012, ఏప్రిల్‌ 28న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఐదు కోర్టులు ఉన్నాయి. 12వ జిల్లా అదనపు జడ్జి కోర్టు, ఫ్యామిలీ కోర్టు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కొనసాగుతున్న 12వ జిల్లా అదనపు జడ్జి కోర్టు గురువారం నుంచి ప్రిన్సిపల్‌  అండ్‌ సెషన్స్‌ జడ్జి కోర్టుగా అప్‌గ్రేడ్‌ కానుంది. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం, కన్సూమర్‌ ఫోరం కోర్టు, స్పెషల్‌ ఎక్సైజ్‌ యాక్ట్‌ కోర్టు, ఇతర నేరాలను విచారించే కోర్టులు కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉంది.  జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు కావడం వల్ల కక్షిదారులకు, న్యాయవాదులకు సమయం, ఖర్చులు కలిసి రానున్నాయి. 

కొడంగల్‌ కోర్టు వికారాబాద్‌ జిల్లా పరిధిలోకి.. 

వికారాబాద్‌ జిల్లా కోర్టు పరిధిలో వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌లో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ఉంటాయి. వికారాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌, నవాబుపేట, ధారూరు, కోట్‌పల్లి, బంట్వారం మండలాలు వస్తాయి. పరిగి కోర్టు పరిధిలో పూడూరు, కులకచర్ల, చౌడాపూర్‌, దోమ, పరిగి మండలాలు, తాండూరు కోర్టు పరిధిలో తాండూరు, పెద్దేముల్‌, యాలాల్‌, బషీరాబాద్‌ మండలాలు ఉండగా, కొడంగల్‌ కోర్టు పరిధిలో కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాలను చేర్చారు. ఇంత వరకు వికారాబాద్‌ కోర్టు పరిధిలో ఉన్న చేవెళ్ల కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలోకి మారనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు పరిధిలో ఉన్న కొడంగల్‌ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్‌ జిల్లా కోర్టు పరిధిలోకి రానున్నాయి.

జిల్లా కోర్టు భవన నిర్మాణానికి పదెకరాలు కేటాయింపు

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కోర్టు భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పదెకరాల స్థలం కేటాయించింది. ఆలంపల్లి ఖిల్లా దాఖలాలో అన్ని హంగులతో కోర్టు భవనాలు నిర్మించేందుకు స్థలం కేటాయిస్తూ ఇటీవల సీఎస్‌ సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్థలంలో కోర్టు భవనాలు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 

ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జిగా సుదర్శన్‌

గురువారం ప్రారంభించనున్న ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జిగా కె.సుదర్శన్‌ను రాష్ట్ర హైకోర్టు నియమించింది. ఆసిఫాబాద్‌లో 3వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా పనిచేసిన సుదర్శన్‌ను వికారాబాద్‌ బదిలీ చేశారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2022-06-02T04:51:29+05:30 IST