కాంగ్రెసోళ్లు.. మళ్లీ కొట్టుకున్నారు!

ABN , First Publish Date - 2022-06-25T05:53:19+05:30 IST

ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెసోళ్లు మరోసారి కొట్టుకున్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరు కుంపటి ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తు రచ్చకెక్కుతున్నారు.

కాంగ్రెసోళ్లు.. మళ్లీ కొట్టుకున్నారు!
ఎల్లారెడ్డిపల్లి తండాలో ఘర్షణ పడుతున్న ఇరువర్గాల కార్యకర్తలు

- ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ఆగని వర్గ విభేదాలు

- సుభాష్‌రెడ్డి వర్సెస్‌ మదన్‌మోహన్‌ వర్గీయుల మధ్య పెరుగుతున్న అగాథం 

- రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

- రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం

- ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఐదు కార్లు ధ్వంసం

- ఎల్లారెడ్డిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుపై తలెత్తిన ఘర్షణ


కామారెడ్డి(ఆంధ్రజ్యోతి)/రాజంపేట, జూన్‌ 24: ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెసోళ్లు మరోసారి కొట్టుకున్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరు కుంపటి ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తు రచ్చకెక్కుతున్నారు. ఇటీవల ఇరువర్గీయుల మధ్య ఘర్షణలకు సైతం దారితీస్తూ వస్తున్నాయి. ఈ రెండు నెలల వ్యవధిలోనే ఎల్లారెడ్డి కాంగ్రెస్సోళ్లు మూడు సార్లు కొట్టుకోవడం ఇరువర్గాల మధ్య మరింత అగాథం పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో ఆ పార్టి కో ఆర్డినేటర్‌ సుభాష్‌రెడ్డి వర్గీయులు, మదన్‌మోహన్‌ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఇరువర్గాల్లోని నాయకులు, కార్యకర్తలకే కాకుండా తండాల్లోని పలువురి మహిళలకు గాయాలయ్యాయి. పలు కార్లు సైతం ధ్వంసం అయ్యాయి. ఇలా ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ఇరువర్గాల మధ్య విభేదాలు తార స్థాయికి చేరి ఘర్షణలకు తావిస్తున్నా అధిష్ఠానం దృష్టి సారించకపోవడం క్షేత్రస్థాయి కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఇరువర్గాల మధ్య విభేదాలతో క్యాడర్‌ నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎల్లారెడ్డిపల్లి తండాలో ఘర్షణ

కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆయా మండలాల పరిధిలో స్థానిక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన నిర్వహిస్తున్నారు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులైన సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు అనుచరులు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో ఇరువర్గాల వారు వేర్వేరుగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చారు. ఇదే క్రమంలో తండాలోని సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయం వద్ద ఇరువర్గాల వారు ఒక్కరినొక్కరు ఎదురయ్యారు. ఇరువర్గాల కార్యకర్తల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్‌ సుభాష్‌రెడ్డి వర్గీయులు, ఆ పార్టి రాష్ట్ర ఐటీసెల్‌ కన్వీనర్‌ మదన్‌మోహన్‌రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. దుడ్డుకర్రలతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో సదాశివనగర్‌ మండలం కుప్రియల్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు జైపాల్‌రెడ్డితో పాటు జనార్ధన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తనతో పాటు మరో ఐదుగురికి పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఈ ఘర్షణలో ఐదుకార్లు ధ్వంసం అయ్యాయి. ఇరువర్గాలకు చెందిన వారి కార్లపై దాడులు  చేసి అద్దాలను ధ్వంసం చేశారు.

ఎల్లారెడ్డిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుతో ముదిరిన విభేదాలు

ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఇది వరకే ఉంది. నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పార్టీ వ్యవహారాలను నడుపుతున్నాడు. పట్టణ కేంద్రంలోనే కాకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ కార్యక్రమాలను స్థానిక నాయకులు, కార్యకర్తలతో నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాష్ట్ర ఐటీసెల్‌ కన్వీనర్‌ మదన్‌మోహన్‌రావు సైతం ఎల్లారెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోనూ తన సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని మండలాల్లోనూ మదన్‌మోహన్‌రావు తన వర్గీయుల చేత ప్రత్యేకంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోనూ తన వర్గానికి చెందిన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు శుక్రవారం కొబ్బరికాయ కొట్టినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఉండగా మరొకటి ఎలా ఏర్పాటు చేస్తారంటూ సుభాష్‌రెడ్డి వర్గీయులు నిలదీశారు. మదన్‌మోహన్‌రావు మరో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతోనే వీరి మధ్యన మరింత విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రాజంపేటలోని ఎల్లారెడ్డిపల్లి తండాలో ఇరువర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇరువర్గాల మధ్య ఆగని విభేదాలు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ ఇరు వర్గాలుగా విడిపోయి కొన్ని నెలల నుంచి ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. చివరకు ఇరువర్గాల మధ్య ఘర్షణలకు సైతం దారి తీస్తోంది. గత నెల రోజుల కిందట ఇరువర్గీయులను అదుపు చేసేందుకు అధిష్ఠానం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కలుగజేసుకుని సంప్రదింపులు చేసినా విభేదాలు మాత్రం ఆగడం లేదు. ఎల్లారెడ్డిలో గత మూడు నెలల కిందట నిర్వహించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగసభ మొదలుకుని నేటి రచ్చబండ కార్యక్రమం వరకు సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు వర్గీయుల మధ్య అగాథం పెరుగుతునే వస్తోంది. ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కలహాలు సృష్టిస్తుండడంపై క్షేత్రస్థాయి క్యాడర్‌లో నిరుత్సాహం ఎదురవుతోంది. ఇప్పటికైనా ఇరువర్గాల వారిని అదుపు చేయాలని ఎల్లారెడ్డిలోని పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

Updated Date - 2022-06-25T05:53:19+05:30 IST