Abn logo
Feb 23 2021 @ 08:27AM

తమిళిసై నిర్ణయమేంటో?

ఎల్జీ ముందు మూడు ప్రత్యామ్నాయాలు

చెన్నై(ఆంధ్రజ్యోతి): నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-డీఎంకే పుదుచ్చేరి ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై పడింది. ప్రభుత్వం కుప్పకూలిపోయినందున ఇప్పుడు తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె నిర్ణయం కోసం రాజకీయవర్గాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నప్పటికీ రాజ్యాంగపదవిలో వున్న ఆమె ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు తమిళనాడు, పుదుచ్చేరిలలో ఆసక్తి రేకెత్తిస్తోంది.


పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్‌ రెండు లేదా మూడో వారంలో ఎన్నిలకు జరగడం ఖాయమైపోయింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు కూడా చేపట్టింది. అయితే ఈ లోపే నారాయణస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో.. గవర్నర్‌ క్రియాశీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ముందున్నవి మూడే మార్గాలని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ అధికారంలో వున్న కూటమి కంటే ప్రతిపక్ష కూటమికి బలం అధికంగా వున్నందున ప్రభుత్వ ఏర్పాటుకు వారికి అవకాశం ఇవ్వడంతో పాటు బలనిరూపణ చేసుకోవాలని ఆహ్వానించడం, లేదా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, లేదా అసెంబ్లీని రద్దు చేయడం మాత్రమే ఆమె ముందున్న ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయి.


ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె ప్రతిపక్ష కూటమికి అవకాశం ఇస్తే.. వారు ముందుకొస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి.. ఈ నాలుగు రోజుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారా? లేక నారాయణస్వామి ప్రభుత్వాన్ని కూల్చి ఆ స్థానంలో కూర్చున్నారన్న అపవాదు తెచ్చుకోవడమెందుకని దూరంగా వుంటారా అన్నది తేలాల్సి వుంది. రంగస్వామి మనస్తత్వాన్ని బట్టి ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవచ్చని పుదుచ్చేరి వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలాకాలంగా పుదుచ్చేరిలో పాగా వేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చి, తమకు మద్దతివ్వాలని కోరితే ఆయన కాదనకపోవచ్చని మరోవర్గం చెబుతోంది. కూటమిధర్మంగా వారికి అండగా నిలవాల్సి వున్నందున ఆయన సహకరించవచ్చని పేర్కొంటోంది. ఇప్పటికే బీజేపీ నేత నమశ్శివాయం ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానిస్తే ఆ మేరకు ముందుకొస్తామని ప్రకటించారు. అన్నాడీఎంకే కూడా ఇదే బాటలో సైకొడుతోంది. కానీ ముందుగా గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు రంగస్వామి బృందాన్ని ఆహ్వానిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి వుంది. అయితే వారం పదిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ రావడం ఖాయంగా కనిపిస్తున్నందున.. గవర్నర్‌ అటువైపు మొగ్గుచూపకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఆమె రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది.


రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తే.. ఎన్నికల నిర్వహణకు మరికొంతకాలం పట్టవచ్చు. ఈ లోపు కేంద్రం భారీగా నిధులు విడుదల చేయడం ఖాయమని, ఆ నిధులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల బీజేపీ పట్ల మంచి సానుకూలత వస్తుందని కూడా పలువురు చెబుతున్నారు. ప్రసుత్తం రాజ్యాంగపదవిలో వున్నప్పటికీ మాతృక బీజేపీయే అయినందున ఆ దిశగానూ ఆలోచించే అవకాశం లేకపోలేదని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆమె స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం వుండకవపోచ్చని, కేంద్రం నుంచి వచ్చే సూచనల మేరకే తమిళిసై నడవడిక వుంటుందని రాజ్‌నివాస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement