మహారాష్ట్రలో నెంబర్ వన్‌ పొజిషన్‌లోకి వెళ్తాం: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-07-13T19:40:09+05:30 IST

మహారాష్ట్రలో నెంబర్ వన్ పార్టీగా కాంగ్రెస్ నిలువబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా..

మహారాష్ట్రలో నెంబర్ వన్‌ పొజిషన్‌లోకి వెళ్తాం: కాంగ్రెస్

ముంబై: మహారాష్ట్రలో నెంబర్ వన్ పార్టీగా కాంగ్రెస్ నిలువబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో అంతా సజావుగానే ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో కాంగ్రెస్ మళ్లీ మొదటి స్థానంలోకి రావడం ప్రజలంతా చూస్తారని, రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి అనేక మంది ఓర్వలేకుండా ఉన్నారని అన్నారు. బీజేపీతో పాటు ఎంవీఏ ప్రభుత్వంలోని భాగస్వాములపైనా పటోలే విమర్శలు గుప్పించారు.


మహా వికాస్ అఘాడి ప్రభుత్వం తన కదలికలపై దృష్టి పెట్టిందని నానా పటోలే ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ఎంవీఏ భాగస్వాములైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లు సైతం మహారాష్ట్రలో తమ పట్టు జారిపోతోందనే అభిప్రాయంతో ఉన్నాయని అన్నారు. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సాగిస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు లభిస్తోందని తెలిపారు.


యూపీలో బీజేపీ ఓటమి తథ్యం..

రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని నానా పటోలే జోస్యం చెప్పారు. ''గత కొద్దికాలంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. కేంద్రం రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్న ఇంధనం ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం సాగిస్తోంది. దేశ ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఇందుకు మూల్యం చెల్లించుకోనుంది. బీజేపీని కూకటివేళ్లతో ప్రజలు పెకిలించేస్తారు''అని పటోలే అన్నారు.


సోనియా ఆదేశించారు...

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన నియామకం జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినట్టు పటోలె చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందినదని, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని సోనియా తనను ఆదేశించారని తెలిపారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో తాము భాగస్వాములైనప్పటికీ కొందరు తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని పటోలే ఆరోపించారు.

Updated Date - 2021-07-13T19:40:09+05:30 IST