నెహ్రూ, ఇందిరాలపై ప్రధాని అటాక్: రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-02-08T21:37:57+05:30 IST

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, చైనా గురించి మాట్లాడుతుంటే మోదీ కాంగ్రెస్‌పై దాడికి పాల్పడుతున్నారని, సరిహద్దు అవతల చైనా మూకలు చేస్తున్న ఆకృత్యాలపై ఏమీ చేయలేని ప్రభుత్వం.. దేశం లోపల ప్రతిపక్షాలను, ప్రజలను అణచివేస్తోందని..

నెహ్రూ, ఇందిరాలపై ప్రధాని అటాక్: రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ సమయం నుంచి మన్మోహన్ ప్రభుత్వం వరకు కాంగ్రెస్ పాలన తీరుపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం సమావేశాల్లో నెహ్రూ, ఇందిరా గాంధీలపై మోదీ విమర్శల వర్షం కురిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.


కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. భారత దేశమంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌గా మార్చాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ లేకపోయుంటే ఏం జరిగేది? అని కొందరు సభ్యులు అడుగుతున్నారని, ఈ ప్రశ్నకు తన సమాధానం ఇదేనని అంటూ, కాంగ్రెస్ లేకపోయుంటే, దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అమలయ్యేది కాదన్నారు. కుల రాజకీయాలు కూడా ఉండేవి కాదన్నారు. సిక్కులు ఊచకోతకు గురై ఉండేవారు కాదని చెప్పారు. కశ్మీరీ పండిట్ల సమస్యలు ఉత్పన్నమయ్యేవి కాదన్నారు. 


కాగా, తాము ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, చైనా గురించి మాట్లాడుతుంటే మోదీ కాంగ్రెస్‌పై దాడికి పాల్పడుతున్నారని, సరిహద్దు అవతల చైనా మూకలు చేస్తున్న ఆకృత్యాలపై ఏమీ చేయలేని ప్రభుత్వం.. దేశం లోపల ప్రతిపక్షాలను, ప్రజలను అణచివేస్తోందని రాజ్యసభా కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అనంతరం తాము ఈ సభలో ఉండమంటూ ప్రధాని మోదీ మాట్లాతుండగానే రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

Updated Date - 2022-02-08T21:37:57+05:30 IST