కేంద్రానికి తలొగ్గిన ట్విటర్‌

ABN , First Publish Date - 2022-01-28T08:39:50+05:30 IST

దిగ్గజ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ కేంద్రంలోని మోదీ సర్కారుకు తలొగ్గి తన ఫాలోవర్ల సంఖ్యను తగ్గిస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశంలో వాక్‌స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్న వ్యవస్థలో ట్విటర్‌ ఇలాంటి చర్యలతో తనకు తెలియకుండానే..

కేంద్రానికి తలొగ్గిన ట్విటర్‌

  • నా ఫాలోవర్లను తగ్గిస్తోంది
  • గత ఏడాది ఆగస్టు నుంచి పెరుగుదలలో స్తబ్దత
  • ఓ దశలో జీరో స్థాయికి ఫాలోవర్ల చేరికలు
  • ట్విటర్‌ సీఈవోకు రాహుల్‌ గాంధీ లేఖ
  • భారత్‌లో సోషల్‌ మీడియాను బెదిరించి 
  • మా గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్య
  • ఆరోపణలను తోసిపుచ్చిన ట్విటర్‌ అధికారులు
  • గురువారం నాడే 10 లక్షల ఫాలోవర్ల పెంపు!


న్యూఢిల్లీ, జనవరి 27: దిగ్గజ మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ కేంద్రంలోని మోదీ సర్కారుకు తలొగ్గి తన ఫాలోవర్ల సంఖ్యను తగ్గిస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశంలో వాక్‌స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్న వ్యవస్థలో ట్విటర్‌ ఇలాంటి చర్యలతో తనకు తెలియకుండానే భాగస్వామి అవుతోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు గత నెల 27న రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ‘‘2021లో తొలి ఏడు నెలల్లో నాకు ఫాలోవర్లు బాగా పెరిగారు. గత ఏడాది ఆగస్టు వరకు వారి సంఖ్య 1.95 కోట్లకు చేరింది. కొత్తగా నన్ను అనుసరించే వారి సంఖ్య రోజుకు సగటున 8వేల నుంచి 10వేల వరకు నమోదైంది. గత ఏడాది ఒక్క మే నెలలోనే 6.4 లక్షల మంది నన్ను అనుసరించారు. కానీ, ఆగస్టులో వారం రోజులపాటు నా ఖాతాను స్తంభింపజేశారు. ఆ తర్వాత అనూహ్యంగా కొత్త ఫాలోవర్లు పెరగడం లేదు. ఫాలోవర్ల సంఖ్య 1.95 కోట్లకే పరిమితమైంది’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.


‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, అధికారం మధ్య సిద్ధాంతపరమైన యుద్ధానికి సామాజిక మాధ్యమాలే వేదికలవుతున్నాయి. అందువల్ల ఈ వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా.. అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. భారత్‌లో మెయిన్‌ స్ర్టీమ్‌ మీడియా అణచివేతకు గురవుతోంది. ఇక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కేశారు. ఇప్పుడు మాకున్న వేదిక సోషల్‌మీడియా మాత్రమే. దాన్ని కూడా బెదిరించి మా గొంతు నొక్కేస్తున్నారు’’ అని రాహుల్‌ వివరించారు. తన గళాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ట్విటర్‌ ఇండియాపై తీవ్ర ఒత్తిడి ఉందనే విషయం తనకు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసినట్లు ఆయన వివరించారు. ‘‘చట్టబద్ధమైన కారణాలు లేకుండా నా ఖాతాను కొన్ని రోజులపాటు నిలిపివేశారు. నేను ట్వీట్‌ చేసిన ఫొటోలనే ఇతరులు కూడా పోస్ట్‌ చేశారు. వారందరినీ వదిలేసి, నన్ను మాత్రమే బ్లాక్‌ చేశారు. దేశాన్ని విధ్వంసం చేయాలనుకునేవారి చేతిలో ట్విటర్‌ పావులా మారకూడదు. దీనిపై మీరు(పరాగ్‌ అగర్వాల్‌) చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలను ట్విటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ అధికారి మెక్‌ స్వీనీ ఖండించారు.


‘‘తప్పుడు సమాచారాన్ని ట్విటర్‌ ఎన్నటికీ సహించదు. తప్పుడు సంఖ్యలపై మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. ఇందులో భాగంగానే కొందరు ఫాలోవర్లలో మార్పులు జరిగి ఉండొచ్చు. ఇదే సాంకేతికతతో ప్రతి వారం లక్షల మంది ఖాతాలను తొలగిస్తుంటాం’’ అని వివరించారు. కాగా.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో హత్యాచారానికి గురైన ఓ బాలిక కుటుంబాన్ని రాహుల్‌ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో బాలికల తల్లిదండ్రులతో దిగిన ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. బాధితురాలి కుటుంబం గుర్తింపునకు సంబంధించిన ఫొటో పెట్టడంతో ఆయన ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేసింది. గురువారం రాహుల్‌ గాంధీ ట్విటర్‌కు రాసిన లేఖ బయటపడడంతో.. అనూహ్యంగా ఆయన ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య పది లక్షల మేర పెరిగి.. 1.96 కోట్లకు చేరడం గమనార్హం.


గులాం నబీ ఆజాద్‌కు కరణ్‌ సింగ్‌ మద్దతు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆ పార్టీ మరో సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ మాత్రం ఆజాద్‌కు మద్దతు ప్రకటించారు. 

Updated Date - 2022-01-28T08:39:50+05:30 IST