కోవిడ్ మరణాలపై సభను కేంద్ర మంత్రి తప్పుదోవ పట్టించారు : కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-07-21T02:21:52+05:30 IST

రాజ్యసభను తప్పుదోవ పట్టించిన కేంద్ర ఆరోగ్య

కోవిడ్ మరణాలపై సభను కేంద్ర మంత్రి తప్పుదోవ పట్టించారు : కాంగ్రెస్

న్యూఢిల్లీ : రాజ్యసభను తప్పుదోవ పట్టించిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్‌పై సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో మెడికల్ ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్దిష్ట సమాచారం లేదని మంత్రి చెప్పడం దారుణమని పేర్కొంది.  ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎందరు రోగులు మరణించారో మనందరికీ తెలుసునని పేర్కొంది. 


కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పిందని, ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఎవరూ మరణించలేదని తెలిపిందని అన్నారు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రతి రాష్ట్రంలోనూ ఎందరు రోగులు మరణించారో మనందరికీ తెలుసునన్నారు. కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆ మంత్రికి వ్యతిరేకంగా తాము సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదిస్తామన్నారు.


కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో 2021 ఏప్రిల్, మే నెలల్లో రెండో ప్రభంజనం తీవ్రత దృష్ట్యా కోవిడ్-19 రోగులకు క్లినికల్ కేర్ సక్రమంగా అందేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందన్నారు. మెడికల్ ఆక్సిజన్, ఇతర పరికరాలను అందజేయడం ద్వారా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. కోవిడ్ మొదటి ప్రభంజనంలో 3,095 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ ఉండేదని, రెండో ప్రభంజనంలో ఈ డిమాండ్ మునుపెన్నడూ లేనివిధంగా 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ జరిగేలా చూసిందన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించి, సంబంధిత మంత్రిత్వ శాఖలు, మాన్యుఫ్యాక్చరర్లు/సప్లయర్లు వంటి ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపి మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులు చురుగ్గా, పారదర్శకంగా జరిపినట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని తెలిపారు.


Updated Date - 2021-07-21T02:21:52+05:30 IST