జడ్పీ పీఠాలపై కాంగ్రెస్‌ గురి!

ABN , First Publish Date - 2022-07-17T09:31:44+05:30 IST

ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ప్రత్యేకించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

జడ్పీ పీఠాలపై కాంగ్రెస్‌ గురి!

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మూడు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులపై కన్ను
  • ఆ మూడు కుటుంబాలతో రేవంత్‌ చర్చలు!
  • అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రతిపక్షం
  • గులాబీ అసంతృప్తులను చేర్చుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ ప్రయత్నాలు
  • రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ప్రత్యేకించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించిన అధికార టీఆర్‌ఎ్‌సను ఇప్పుడు అవే ప్రతిపక్ష పార్టీలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తి నేతలను, తటస్థులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగం గా రాజకీయంగా ఎంతో కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. బీజేపీ ఇటీవలే.. తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కాషా య కండువా కప్పింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా మంత్రి సబితారె డ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గా న్ని టార్గెట్‌ చేసింది. బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డిని, కొందరు కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొంది. తాజాగా మరో భారీ వ్యూహానికి తెరలేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జడ్పీ చైర్మన్‌ పీఠాలపై హస్తం పార్టీ కన్నేసింది. ఈ మేరకు టీఆర్‌ఎ్‌సపై అసంతృప్తితో ఉన్న మూడు జి ల్లా పరిషత్‌ల చైర్మన్ల కుటుంబాలతో కాంగ్రెస్‌ నాయక త్వం మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. పీసీసీ అ ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 


అసంతృప్తిలో ’పట్నం’ కుటుంబం

వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి, ఎమ్మె ల్సీ పట్నం మహేంద్‌రెడ్డి భార్య సునీతారెడ్డి ఉన్న విష యం తెలిసిందే. అయితే కొంతకాలంగా మహేందర్‌రెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉంది. జిల్లాలో తమ వ్యతిరేకులకు పార్టీ నాయకత్వం పె ద్దపీట వేస్తుండడంపై మహేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నా రు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, మహేందర్‌రెడ్డికి అసలు పొసగడం లేదు. ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నాయకత్వమే తమను పొమ్మనలేక పొగబెడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తనకు అనుకూలంగా మలచుకుంటూ మహేందర్‌రెడ్డి కుటుంబంతో చర్చలు జరిపినట్లు సమాచారం. మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పట్నం కుటుంబానికి రేవంత్‌రెడ్డి బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహేందర్‌రెడ్డితో పాటు ఆయన భార్య సునీతారెడ్డి, సోదరుడు నరేందర్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే రేవంత్‌ ఆఫర్‌పై మహేందర్‌రెడ్డి కుటుంబం తర్జనభర్జన  పడుతోంది.


గాలం వేస్తున్న బీజేపీ..

బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌ అసంతృప్తులకు గాలం వేస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొన్నాళ్లపాటు తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఇటీవల బీజేపీ తనవైపు తిప్పుకొని కండువా కప్పిన విషయం తెలిసిందే.  తాజాగా టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరికొందరు నేతలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. పట్నం మహేంద్‌రెడ్డికి కూడా ఆఫర్‌ ఇచ్చినప్పటికీ ఆయన కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొందరు పెద్ద నేతలనే బీజేపీ టార్గెట్‌ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎ్‌సలో మళ్లీ టిక్కెట్‌ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న కొందరు సిటింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోగానీ, బీజేపీలోగానీ దూకేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. వీరు ఈ రెండు పార్టీల్లోనూ ఖర్చీ్‌పలు వేసుకుంటున్నట్లు తెలిసింది. 


తీగల కృష్ణారెడ్డి కోసం..

హైదరాబాద్‌ మాజీ మేయర్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల మంత్రి సబితారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సబితారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తరువాత సబితారెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. తనపై గెలిచిన సబితారెడ్డిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకోవడాన్ని తీగల మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న తీగలను బుజ్జగించేందుకు ఆయన కోడలు అనితారెడ్డికి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. అయితే తీగలకు, మంత్రి సబితకు పొసగడం లేదు. టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడే ఆయన ఇటీవల సబితపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తీగల కృష్ణారెడ్డితో కాంగ్రెస్‌ నాయకత్వం టచ్‌లో ఉంది. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇదే జరిగితే తీగల కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి కూడా పార్టీని వీడే అవకాశాలున్నాయి. మేడ్చల్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంత్రి మల్లారెడ్డితో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి పొసగడం లేదు. సుధీర్‌రెడ్డి పార్టీ క్రియాశీల వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తనయుడు మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉన్నారు. సుధీర్‌రెడ్డితో కూడా కాంగ్రెస్‌ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇలా ముగ్గురు జడ్పీ చైర్మన్‌ల కుటుంబాలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇదే జరిగితే టీఆర్‌ఎ్‌సకు భారీ దెబ్బతగిలే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-17T09:31:44+05:30 IST