Jharkhand : ఆ ముగ్గురు ఎమ్మల్యేలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-07-31T20:03:05+05:30 IST

నగదు కట్టలతో పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో పట్టుబడిన ముగ్గురు

Jharkhand : ఆ ముగ్గురు ఎమ్మల్యేలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

రాంచీ : నగదు కట్టలతో పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో పట్టుబడిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. జార్ఖండ్ (Jharkhand)  కాంగ్రెస్ ఇన్‌ఛార్జి అవినాశ్ పాండే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇర్ఫాన్ అన్సారీ (జమ్‌‌‌తారా), రాజేశ్ కచ్చప్ (ఖిజ్రి), నామన్ బిక్సల్ కొంగరి ( కొలెబిర)లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఓ దృష్టాంతాన్ని సృష్టించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. 


కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) మాట్లాడుతూ, ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ (BJP) కూల్చుతోందన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలను కూల్చిన తర్వాత ఇప్పుడు జార్ఖండ్‌ వంతు వచ్చిందన్నారు. ప్రతి నెలా తన దిగజారుడు రాజకీయాలకు సరికొత్త ఉదాహరణను బీజేపీ చూపిస్తోందన్నారు. ప్రభుత్వానికి ఓ విధి, కర్తవ్యం ఉంటాయన్నారు. వీటిని నిర్వహించడానికే అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించడం ప్రభుత్వ కర్తవ్యం కాదని చెప్పారు. 


ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా గ్రామీణ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ స్వాతి భంగాలియా వెల్లడించిన వివరాల ప్రకారం, నిర్దిష్ట సమాచారం అందడంతో శనివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. పశ్చిమ కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో వాహనాలను తనిఖీ చేశారు. ఓ కారులో ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కారు నుంచి రూ.49 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. 


తాము చీరలను కొనడానికి వచ్చామని ఎమ్మెల్యేలు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. 


Updated Date - 2022-07-31T20:03:05+05:30 IST