Unprecedented: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల.. బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు

ABN , First Publish Date - 2022-08-17T01:45:34+05:30 IST

గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేసిన..

Unprecedented: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల.. బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు-2002 సమయంలో బిల్కిస్ బానోపై (Bi సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబ సభ్యుల ఏడుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో 11 మంది దోషులు మంగళవారంనాడు జైలు నుంచి విడుదలయ్యారు. వీరు విడుదలకు మార్గం సుగమం చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఇదేనా మోదీ చెబుతున్న ''రాజధర్మం'' అంటూ నిలదీసింది. ఎర్రకోట నుంచి మహిళా శక్తి అంటూ ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేసి కొద్ది గంటలు కూడా కాకముందే బిల్కిస్ బానో కేసు దోషులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవడం మునుపెన్నడూ లేదని తప్పుపట్టింది. ప్రధాని వ్యాఖ్యల ఉద్దేశం కూడా ఇదేనా అని కాంగ్రెస్ నేత పవన్ ఖేర బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో నిలదీశారు.


''పధ్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారనే సాకుతో, జైలులో సత్ర్పవర్తన పేరుతో నేర తీవ్రతను విస్మరించారు. అత్యాచారానికి ఏ శిక్ష అయినా సరిపోతుందా? ఇవాళ దోషులను విడిచిపెట్టడం, వారిని సన్మానించడం చూస్తున్నాం. ఇదేనా అమృత్ మహోత్సవ్ అంటే?" అని పవన్ ఖేర నిలదీశారు. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం కేవలం మాటలకే పరిమితమా? దానికి అర్ధమే లేదా? దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలి. లేదంటే ఆయన మాటలను ఆయన సొంత పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వాలు వినడం లేదా అనేది చెప్పాలని ఖేర డిమాండ్ చేశారు.


సుప్రీంకోర్టు 2017లో జోక్యం చేసుకుని బిల్కిస్ బానో కుటుంబానికి రూ.50 లక్షలు సాయం అందజేయాలని ఆదేశించిన విషయాన్ని ఖేర గుర్తుచేశారు. ఆమె పట్ల ఘోర తప్పిదం జరిగిందనడానికి, ఆమె కుటుంబం ఎంత వేదన అనుభవించిందో చెప్పడానికి సుప్రీం ఇచ్చిన ఆదేశం ఒక్కటే చాలని అన్నారు. ''ఎర్రకోట నుంచి మహిళా సాధికారత అనే మాటలు మాట్లాడడానికి ప్రధానికి ఎంత ధైర్యం?'' అని ఖేర ప్రశ్నించారు. కతువా కేసును సైతం ఆయన ప్రస్తావిస్తూ, రేపిస్టులకు మద్దతుగా బీజేపీ సీనియర్ నేతలు రోడ్లపైకి వచ్చారని, ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగమేనా అని ఆయన నిలదీశారు. దోషుల విడుదలకు ఇచ్చిన ఉత్తర్వును గుజరాత్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని, లేదంటే ఎర్రకోట నుంచి మోదీ మాట్లాడిన మాటలనైనా ఆయన వెనక్కి తీసుకోవాలని అన్నారు. కాగా, బిల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్జేడీ, ఎంఐఎం, సీపీఎం, టీఎంసీ, బీఎస్‌పీ తప్పుపట్టగా, గుజరాత్ ఎన్నికలపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రం ఇంకా స్పందించలేదు.

Updated Date - 2022-08-17T01:45:34+05:30 IST