కాంగ్రెస్‌లో ఎడతెగని చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-05-18T17:48:24+05:30 IST

ఎవరికి వారు తమ శక్తిమేరకు అధిష్ఠానం వద్ద లాభీయింగ్‌ చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఈ పదవి కోసం

కాంగ్రెస్‌లో ఎడతెగని చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

  • తేలని సీఎల్పీ లీడర్‌ ఎంపిక


చెన్నై : కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత నియామకం ఆ పార్టీకి తలకు మించిన భారంగా మారింది. ఆ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎవరికి వారు తమ శక్తిమేరకు అధిష్ఠానం వద్ద లాభీయింగ్‌ చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఈ పదవి కోసం నలుగురు సీనియర్‌ శాసనసభ్యులు పోటీపడుతుడడం ఈ ఉత్కంఠకు కారణంగా మారింది. మరోవైపు ఆ పదవిని తననే ఎంపికచేయాలంటూ కాంగ్రెస్‌ మహిళా శాసన సభ్యురాలు విజయతరణి పట్టుబడుతున్నారు. సీఎల్పీ అధ్యక్షపదవి కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల శాసనసభ స్పీకర్‌గా అప్పావు ఎన్నికైన సమయంలో పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగిం చడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యులు ప్రిన్స్‌, విజయతరణి పోటీపడ్డారు. ముందువరుస సీటులో విజయతరణి కూర్చుని నానా హడావుడి చేశారు. శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి మిత్రపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ 25 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 18 మందిని గెలిపించుకుంది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తర్వాత అధిక సభ్యులున్న పార్టీగా కాంగ్రెస్‌ నిలిచింది. 


శాసనసభలో కాంగ్రెస్‌ తర్వాత అధిక సభ్యులు కలిగిన డీపీఐ, ఎండీఎంకే, వామ పక్షాలు సభాపక్ష నాయకులను ఎంపిక చేసి ప్రకటించాయి. కానీ కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత, ఉపనేత, విప్‌ నియామకం మాత్రం ఇంకా జరగలేదు. 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 13 మంది తొలిసారిగా గెలిచారు. తక్కిన ఐదుగురిలో మూడుసార్లు, రెండు సార్లు గెలిచినవారున్నారు. ప్రస్తుతం సీఎల్పీ అధ్యక్షపదవికి ప్రధానంగా నలుగురు శాసనసభ్యులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు ప్రిన్స్‌, విజయతరణి, రాజేష్‌, మునిరత్నం ఆ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎల్పీ అధ్యక్షపదవికి మునుపెన్నడూ లేనంతగా గట్టి పోటీ నెలకొనడంతో పార్టీ అధిష్ఠానం మునుపటిలా ఆ పదవికి సులువుగా ఎవరినీ నియమించలేకపోతోంది. 


ఈ పరిస్థితుల్లో సీఎల్పీనేత ఎంపిక బాధ్యతలను ఏఐసీసీ పరిశీలకులు మల్లికార్జున ఖార్గే, పుదుచ్చేరి ఎంపీ వైద్యలింగం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దినేష్‌ గుండూ రావుకు అప్పగించింది. వీరిలో మల్లికార్జున ఖార్గే, ఎంపీ వైద్యలింగం సోమవారం సాయంత్రం చెన్నై చేరుకుని రాయపేటలోని పార్టీ కార్యాలయం సత్యమూర్తిభవన్‌లో కాంగ్రెస్‌ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. సీఎల్పీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై శాసనసభ్యుల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చిదంబరం, తంగవేలు, కేఎస్‌ అళగిరి తదితరులు కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T17:48:24+05:30 IST