Smriti daughter Goa bar row: ఆ బార్ స్మృతి ఇరానీ కూతురిదే.. సాక్ష్యం ఇదిగో.. కాంగ్రెస్ వీడియోలు వైరల్

ABN , First Publish Date - 2022-07-24T21:59:05+05:30 IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ నిబంధనలకు విరుద్ధంగా గోవాలో బార్ నడుపుతున్నారంటూ ఆరోపణ చేసిన కాంగ్రెస్ తమవద్ద సాక్ష్యాలు ఉన్నాయని

Smriti daughter Goa bar row: ఆ బార్ స్మృతి ఇరానీ కూతురిదే.. సాక్ష్యం ఇదిగో.. కాంగ్రెస్ వీడియోలు వైరల్

ఇంటర్నెట్ డెస్క్ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smiriti Irani ) కూతురు జోయిష్ ఇరానీ(Zoish Irani) నిబంధనలకు విరుద్ధంగా గోవాలో బార్ నడుపుతున్నారంటూ ఆరోపణ చేసిన కాంగ్రెస్(Congress) తమవద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతోంది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ బీవీ.శ్రీనివాస్ విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. ‘ స్మృతి ఇరానీ డ్రామాకు ముందు, తర్వాత’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో తొలి భాగంలో కాంగ్రెస్ ఆరోపణలను స్మృతి ఇరానీ ఖండించగా.. రెండవ భాగంలో ‘‘ ఈ రెస్టారెంట్ నాదే’’ అని జోయిష్ ఇరానీ చెప్పారు. గతంలో ఓ యూట్యూబర్ చిత్రీకరించిన వీడియోలో ఆమె మాట్లాడారు.


‘‘ గోవాలో ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. కానీ నా రెస్టారెంట్‌లో మాత్రమే విదేశీ ఆహారం దొరుకుతుంది’’ ఆమె పేర్కొన్నారు. దీనికితోడు గతంలో రెస్టారెంట్ ఫుడ్‌ని సోషల్ మీడియాలో షేర్  చేసేటప్పుడు జోయిష్ ఇరానీని యజమానిగా పేర్కొన్న పోస్టులను కూడా కాంగ్రెస్ నేతలు షేర్ చేశారు. ఇంతకంటే సాక్ష్యాలు ఇంకేమి కావాలని కాంగ్రెస్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ట్విటర్‌లో సర్క్యూలేట్ అవుతున్న మరికొన్ని ఫొటోల ప్రకారం ఈ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. ‘ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ ఇటాలియన్ రెస్టారెంట్ అండ్ బార్’లో బార్ అనే పదానికి స్టిక్కర్ అంటించారు. ఈ స్టికర్‌ను కాంగ్రెస్ నేతలు తొలగించి మరీ చూపించారు. కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనని చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరిట లైసెన్స్ ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు హస్యం పండించేలా స్మృతిపై విమర్శలు గుప్పించారు.


కాంగ్రెస్ ఆరోపణ - స్మృతి ఇరానీ కౌంటర్..

కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో నిబంధనలకు విరుద్ధంగా బార్‌ నడుపుతున్నారంటూ కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది తీవ్రమైన అంశమేనంటూ కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసు ప్రతులను మీడియాకు విడుదల చేసింది. ‘స్మృతి కూతురు నడుపుతున్న రెస్టారెంట్‌ లైసెన్స్‌ను మే 2021లో చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద జూన్‌ 2022న తీసుకున్నారు. 13 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద లైసెన్స్‌ ఎలా తీసుకుంటారు? ఇది ముమ్మాటికీ అక్రమమే’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా చెప్పారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్‌కు ఒక బార్‌ లైసెన్స్‌ మాత్రమే ఉండాలని, కానీ సిల్లీ సోల్స్‌ గోవా రెస్టారెంట్‌ పేరిట రెండు బార్‌ లైసెన్స్‌లు ఉన్నాయని పవన్‌ ఆరోపించారు. స్మృతి ఇరానీ ప్రమేయం లేకుండానే ఆమె కూతురు లైసెన్స్‌ పొందడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. స్మృతిని ప్రధాని మోదీ తక్షణం పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ బార్‌ దరిదాపుల్లోకి మీడియా వెళ్లకుండా బౌన్సర్లను నియమించారని పవన్‌ ఖేరా చెప్పారు. అయితే, ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. తన కుమార్తెకు 18 ఏళ్లని, కాలేజీ మొదటి సంవత్సరంలో ఉందని తెలిపారు. సిల్లీ సోల్స్‌ గోవా రెస్టారెంట్‌తో తమ క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్మృతి కూతురు జోయిష్‌ ఇరానీ న్యాయవాది స్పష్టం చేశారు. ఆమె యజమాని కూడా కాదన్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారు ల నుంచి ఎలాంటి షోకాజ్‌ నోటీసు అందుకోలేదని వివరించారు.





Updated Date - 2022-07-24T21:59:05+05:30 IST