Abn logo
Oct 16 2020 @ 17:15PM

దుబ్బాక బైపోల్స్ ముంగిట కాంగ్రెస్‌కు షాక్‌ తగలనుందా?

Kaakateeya

దుబ్బాక ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం జోరందుకున్న సమయంలో హస్తం పార్టీలో అలకలు, అసమ్మతి అగ్గిరాజేస్తోందా? టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కక్కరుగా చేయి జారిపోతున్నారా? బయట నుంచి ప్రముఖ నాయకులు మోహరించినా స్థానిక నేతల సహకారం కరువైందా? స్వయంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పక్కచూపులు చూస్తున్నారా? ఆయనలో అసంతృప్తి రేగడానికి కారకులు ఎవరు? సిద్దిపేట జిల్లాలో దామోదర రాజనర్సింహ ఎత్తుగడలు ఆ పార్టీకి నష్టమా? లాభమా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఎదురించాలంటే ఎత్తుకు పై ఎత్తులు వేయాలి..అంతకుమించిన ఐక్యత కనబరచాలి. స్థానిక నేతల్లో ఆత్మస్తైర్యం నింపాలి..సరిగ్గా ఈ అంశాలే దుబ్బాక ఉప ఎన్నిక ముంగిట కాంగ్రెస్ పార్టీలో లోపించినట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి..కాంగ్రెస్‌ పార్టీలో చేరి అనూహ్యంగా అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇదే విషయం హస్తం పార్టీలో ముసలానికి దారితీసింది. బయటి నేతల రాజకీయాలతో స్థానిక నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారనే చర్చ వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీరుతో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తీవ్ర అసంతృత్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపించినా నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్‌ దాదాపు ఖరారు చేసింది. ఆయనే బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో దామోదర రాజనర్సింహ చక్రం తిప్పి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారట. 

నిజానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి, దామోదర రాజనర్సింహకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ, టిఆర్ఎస్ పొత్తులో భాగంగా చెరుకు ముత్యంరెడ్డికి టిక్కెట్‌ రాకపోవడంతో ఆ సమయంలో రాజనర్సింహ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న ముత్యంరెడ్డిని ఆయన కొడుకు శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఒప్పించి కాంగ్రెస్‌ టిక్కెట్టు ఇప్పించారు. ఆ ఎన్నికల్లో ముత్యంరెడ్డి విజయం సాధించడం ద్వారా రాజనర్సింహ తన వ్యూహం సరైనదేనని నిరూపించారు. సరిగ్గా అదే వ్యూహాన్ని తాజాగా దుబ్బాక ఉపఎన్నికలో అమలు చేశారు దామోదర రాజనర్సింహ. 2009లో ముత్యంరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి టిక్కెట్టు ఇప్పించినట్లే..ఇప్పుడు ఆయన కుమారుడికి టిక్కెట్టు ఇప్పించారు. ఈ పరిణామమే పార్టీ నాయకుల్లో  తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ముఖ్యంగా దుబ్బాక టిక్కెట్టు వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అసహనంతో ఉన్నారు. నర్సారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దామోదరతో విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మల్లన్నసాగర్ భునిర్వాసితుల ఆందోళనలో తనను కాదని దామోదర రాజనర్సింహ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న నర్సారెడ్డి తాజా పరిణామాలతో మరింత నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో చెరుకు శ్రీనువాస్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో స్థానిక నాయకుల్లో అసమ్మతి భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారికి అవకాశం ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం పట్ల బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి. టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన నలుగురు సీనియర్ నేతలు కోమటి రెడ్డి వెంకట నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాబీ గూటికి చేరారు. వారు వెళ్లడం వెనక పరోక్షంగా నర్సారెడ్డి ప్రోత్సాహం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే బాటలో తూంకుంట నర్సారెడ్డి సైతం హస్తం పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా..అదేం లేదంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. పార్టీలో తానంటే గిట్టని వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తన ఆంతరంగికుల వద్ద ఆయన వాపోయారట. పార్టీ మారే ఉద్దేశం ఉన్న నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే కొట్టిపారేయడం సర్వసాధారణం..దుబ్బాక ఉప ఎన్నిక ముంగిట తూంకుంట నర్సారెడ్డి హస్తం పార్టీకి హ్యాండ్‌ ఇస్తారా? లేక ఆయనను చేజారకుండా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పార్టీ పెద్దలు బుజ్జగించి కాపాడుకుంటారా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతోంది.

Advertisement
Advertisement
Advertisement