జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాక్

ABN , First Publish Date - 2022-03-21T22:38:29+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది. జగ్గారెడ్డికి అదనంగా ఉన్న పార్టీ బాధ్యతలను టీపీసీసీ తొలగించింది.

జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాక్

హైదరాబాద్‌: ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది. జగ్గారెడ్డికి అదనంగా ఉన్న పార్టీ బాధ్యతలను టీపీసీసీ తొలగించింది. పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి ఆయనను టీపీసీసీ తప్పించింది. స్వతంత్రంగా ఉంటానని గతంలో హైకమాండ్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించనప్పటి నుంచి జగ్గారెడ్డి గుర్రుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఆయన పనితీరును జగ్గారెడ్డి తప్పుబడుతున్నారు. ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయన పార్టీ లైన్‌లో పనిచేయడంలేదన్నారు. కాంగ్రె్‌సను గెలిపించే శక్తి రేవంత్‌కు ఉంటే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, సంగారెడ్డిలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని సవాల్‌ విసిరారు. అప్పుడు రేవంత్‌రెడ్డే హీరో అని తాను ఒప్పుకొంటానన్నారు. తాను గెలిస్తే తానే హీరోనన్నారు. ఒకవేళ ఇద్దరమూ ఓడిపోతే ఇద్దరమూ జీరోలమేనన్నారు.


అయితే కాంగ్రెస్ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్‌ నేతలు కొందరు ఆదివారం ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అయితే వీహెచ్‌.. మంత్రి హరీశ్‌రావును కలిసినట్లు, ఆ తరువాతే ఈ భేటీ జరుగుతున్నట్లు వార్తలు రావడంతో హైడ్రామా చోటుచేసుకుంది. వీహెచ్‌ నుంచి ఆహ్వానం అందిన వారితో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్‌ కృష్ణన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఏదైనా ఉంటే పార్టీ ఫోరంలో మాట్లాడుకోవాలే తప్ప ఇలాంటి సమావేశాలు పెట్టవద్దని సూచించారు. దీంతో పలువురు సీనియర్‌ నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తూ సమావేశం ఏర్పాటు చేసిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జగ్గారెడ్డిపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-03-21T22:38:29+05:30 IST