సిబల్ నివాసం వద్ద దాదాగిరి దారుణం : ఆనంద్ శర్మ

ABN , First Publish Date - 2021-09-30T20:55:17+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నివాసం వద్ద

సిబల్ నివాసం వద్ద దాదాగిరి దారుణం : ఆనంద్ శర్మ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నివాసం వద్ద ఆ పార్టీ కార్యకర్తల దాదాగిరిపై ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు, వేర్వేరు భావాలు ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని చెప్పారు. అసహనం, హింస అనేవి కాంగ్రెస్ విలువలకు, సంస్కృతికి తెలియనివని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను బలపరచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. 


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్టులో లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో కపిల్ సిబల్, ఆనంద్ శర్మ ఉన్నారు. కపిల్ సిబల్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, పంజాబ్‌లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్ లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి సన్నిహితులుగా పేరు పడినవారు దూరంగా వెళ్ళిపోయారని, సన్నిహితులుకానివారుగా పేరు పడినవారు పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సిబల్ నివాసం వద్ద నిరసన తెలిపారు. పార్టీ నుంచి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు.


ఈ నేపథ్యంలో ఆనంద్ శర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. కపిల్ సిబల్ నివాసం వద్ద దాడి, దాదాగిరి వార్తలు విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. ఈ దయనీయమైన చర్యలు పార్టీకి అప్రతిష్ఠ తెస్తాయన్నారు. దీనిని తీవ్రంగా ఖండించాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను బలపరచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. సిబల్ నివాసంపై దాడికి బాధ్యులైనవారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై విచారణ జరిపి, గట్టి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. 


Updated Date - 2021-09-30T20:55:17+05:30 IST