కాంగ్రెస్ పునరుజ్జీవం ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యం : సోనియా గాంధీ

ABN , First Publish Date - 2022-04-05T17:26:13+05:30 IST

కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని

కాంగ్రెస్ పునరుజ్జీవం ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యం : సోనియా గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. పార్టీ పునరుజ్జీవం పొందడం కేవలం తమ కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోందని, భయాందోళనలను వ్యాపింపజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం సోనియా మాట్లాడుతూ, భవిష్యత్తు మునుపటి కన్నా సవాళ్ళతో కూడినదని చెప్పారు. ‘‘మన అంకితభావం, దృఢ సంకల్పం, తట్టుకుని నిలబడగలిగే సత్తా కఠిన పరీక్షకు నిలుస్తున్నాయి. మన విశాలమైన సంస్థలో అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా ముఖ్యం’’ అని తెలిపారు. ఐకమత్యాన్ని సాధించడం కోసం ఏం చేయడానికైనా తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన నేపథ్యంలో త్వరలో మేధోమథనం జరగబోతోంది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. దీనిపై సోనియా మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని, అత్యంత బాధాకరమని చెప్పారు. తాను ఇతర నేతలతో కూడా మాట్లాడానని, పార్టీని బలోపేతం చేయడానికి సలహాలు తీసుకున్నానని చెప్పారు. 


పార్టీని ప్రక్షాళన చేయాలని గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ఇటీవల సోనియా గాంధీతో మాట్లాడిన సంగతి తెలిసిందే. 


రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే విధంగా నేతలంతా ఐకమత్యంగా ఉండాలని సోనియా గాంధీ చెప్తున్నారు. ఐక్యత సాధించడం కోసం గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది నేతలకు కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణం అంతర్గత కలహాలేనని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తుకు అతి త్వరగా భరోసా కల్పించవలసిన అవసరం ఉందని సోనియా చెప్పారు.


Updated Date - 2022-04-05T17:26:13+05:30 IST