గోవా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-02-07T01:30:07+05:30 IST

గోవా ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే..

గోవా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

పనజి: గోవా ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిలిచిపోయిన మైనింగ్ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ స్పష్టమైన హామీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గోవా సీనియర్ ఎలక్షన్ అబ్జర్వర్ పి.చిదంబరం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వనరులకు కొరత లేనప్పటికీ, సక్రమ కేటాయింపులు జరక్కపోవడమే ప్రధాన సమస్య అని అన్నారు.


 ''నిధులు సమకూర్చుకునే మార్గాలు ఎప్పుడూ సమస్య కాదు. నిధుల కేటాయింపులతోనే అసలు సమస్య. తెలివిగా ఆలోచన చేసి నిధులు కేటాయిస్తే, మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో వాటిని ఐదేళ్లలో సాధించగలుగుతాం'' అని చిదంబరం పేర్కొన్నారు. రాష్ట్ర వనరులు ఏవిధంగా పెంచుకోవచ్చో సూచన ప్రాయంగా ఆయన చెబుతూ, ఐటీ, ఫార్మాస్యూటికల్ హబ్‌గా గోవాను తీర్చిదిద్దితే ఆదాయ వనరులు ఇబ్బడిముబ్బడి అవుతాయని అన్నారు. సమస్య తెలుసుకుని కూడా పట్టించుకోకపోతే అది రెవెన్యూపై తప్పనిసరిగా పడుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి చట్టబద్ధమైన మైనింగ్‌ పనులను తాము ప్రారంభిస్తామని తెలిపారు.


పార్టీ ఫిరాయింపులపై అడిగిన ఒక ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ, గోవాలో పార్టీ ఫిరాయింపులకు ముగింపు పలకాలన్నారు. ఫిరాయింపుదారులను ఎన్నికల్లో ఓడించడం ద్వారా ప్రజలే ఆ పని చేయాలని అన్నారు. కాగా, పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో గోవా ఇన్‌చార్జి దినేష్ గుండూరావు, రాష్ట్ర యూనిట్ చీఫ్ గిరీష్ చోడంకర్, కేంద్ర మాజీ మంత్రి రమాకాంత్ ఖలప్, గోవా ఎన్నికల ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి అల్కా లంబా తదితరులు పాల్గొన్నారు. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 14న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-02-07T01:30:07+05:30 IST