Upలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపుల పర్వం..

ABN , First Publish Date - 2022-01-20T18:07:31+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు....

Upలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపుల పర్వం..

ప్రమోద్ గుప్తా, ఆదితిసింగ్‌ల రాజీనామా...బీజేపీలో చేరిక

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు. తాజాగా గురువారం సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. సమాజ్ వాదీపార్టీ నేరగాళ్లు, జూదగాళ్లకు అడ్డాగా మారిందని ప్రమోద్ గుప్తా ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ములాయంసింగ్ నే జైలులో పెట్టాడని ప్రమోద్ గుప్తా ఆరోపించారు. ఎస్పీ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందని ప్రమోద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదితిసింగ్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. 


ఆదితిసింగ్ గతంలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినా అధికారికంగా సోనియాగాంధీకి రాజీనామా లేఖను గురువారం పంపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో సమాజ్ వాదీపార్టీని లక్ష్యంగా చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన అఖిలేష్ యాదవ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.అఖిలేష్ యాదవ్ మైన్‌పురి సదర్, ఛిబ్రామౌ (కన్నౌజ్), గోపాల్‌పూర్ (అజంగఢ్), గున్నౌర్ (సంభాల్) అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయమై అఖిలేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏ స్థానం నుంచి అఖిలేష్ ఎన్నికల బరిలోకి దిగుతారన్నది జాబితా విడుదల చేసే దాకా ఆగాల్సిందే.


Updated Date - 2022-01-20T18:07:31+05:30 IST