‘మోదీ గో బ్యాక్‌’ అంటూ కాంగ్రెస్‌ నిరసన

ABN , First Publish Date - 2022-07-05T07:07:39+05:30 IST

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదంటూ ‘మోడీ గో బ్యాక్‌’ నినాదంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి.

‘మోదీ గో బ్యాక్‌’ అంటూ కాంగ్రెస్‌ నిరసన
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ శ్రేణులు

విశాఖపట్నం, జూలై 4: రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్రమోదీకి  రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదంటూ ‘మోడీ గో బ్యాక్‌’ నినాదంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. నగర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీసీసీ అధికార ప్రతినిధి వజ్జిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా బుట్టదాఖలయ్యిందని, విభజన హామీల ఊసేలేదని, రైల్వేజోన్‌ విషయంలో అన్యాయం చేశారని ద్వజమెత్తారు.


రాష్ట్రానికి ఇంత నష్టం చేసి ఏ ముఖం పెట్టుకుని మోదీ రాష్ట్రంలో అడుగుపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజు, పార్టీ నాయకులు మూలవెంకటరావు, గుత్తుల శ్రీనివాసరావు, హైదరాలీసింకా, సోడాదాసి సుధాకర్‌,  సునందాదేవి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T07:07:39+05:30 IST