మైనారిటీలపై ఉగ్ర ముద్ర!

ABN , First Publish Date - 2022-05-14T08:09:27+05:30 IST

ప్రధాని మోదీ దేశాన్ని శాశ్వతంగా మతపరంగా విడదీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. ‘గరిష్ఠ పాలన..

మైనారిటీలపై ఉగ్ర ముద్ర!

దుర్మార్గంగా టార్గెట్‌ చేస్తున్నారు..

రాజకీయ ప్రత్యర్థులకు బెదిరింపులు

శాశ్వతంగా మతపరమైన విభజనకు యత్నం

ప్రజల్లో భయం, అభద్రతాభావం

ప్రధాని మోదీపై సోనియా గాంధీ ఫైర్‌

కాంగ్రెస్‌ పార్టీ పనితీరు మారాలి

సంస్థాగత సంస్కరణలు తక్షణావసరం

సమష్టి కృషితోనే పునరుజ్జీవం

మీకెంతో ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలి

చింతన్‌ శిబిర్‌లో అధ్యక్షురాలి పిలుపు

ఇక ఒక కుటుంబంలో ఒకరికే పదవి!

సోనియా ఫ్యామిలీకి మినహాయింపు


ఉదయ్‌పూర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ దేశాన్ని శాశ్వతంగా మతపరంగా విడదీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. ‘గరిష్ఠ పాలన.. కనిష్ఠ ప్రభుత్వం’ అంటూ ఆయన, ఆయన సహచరులు తరచూ అనడంలోని అసలు అంతరార్థం ఇదేనని చెప్పారు. అధికార కేంద్రీకరణ చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రె్‌సలో సంస్థాగతంగా తక్షణ సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమని నొక్కిచెప్పారు. శుక్రవారమిక్కడ ప్రారంభమైన మూడ్రోజుల ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’లో ఆమె ప్రసంగించారు. ‘ప్రజలు నిరంతరం భయాందోళనలు, అభద్రతతో బతికేలా చేస్తున్నారు. మైనారిటీలను దుర్మార్గంగా టార్గెట్‌ చేస్తున్నారు. సమాజంలో అంతర్భాగం.. సమాన పౌరులైన వారిపై ఉగ్రముద్ర వేస్తున్నారు. వారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. శతాబ్దాల భిన్నత్వ భావనలను సమాజాన్ని విభజించడానికి ఉపయోగించుకుంటున్నారు.  ఏకత్వం, వైవిధ్యాలను అణచివేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారు.


వారి ప్రతిష్ఠపై బురదజల్లుతున్నారు. పనికిమాలిన సాకులతో జైలుపాల్జేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. అన్ని ప్రజాస్వామిక సంస్థల స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు. చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూ వంటి నేతలను కించపరుస్తున్నారు. వారి కృషిని, విజయాలను, త్యాగాలను ప్రణాళిక ప్రకారం వక్రీకరిస్తున్నారు. మహాత్మాగాంధీ హంతకులను కీర్తిస్తున్నారు’ అని విరుచుకుపడ్డారు. రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ పునాదులైన న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికవాదాలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలు.. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.


బ్యూరోక్రసీ, కార్పొరేట్లు, పౌరసమాజం, మీడియాను తమ దారికి తెచ్చుకునేందుకు మోదీ సర్కారు భయపెడుతోందని విమర్శించారు. అన్నిటిపైనా అనర్గళంగా ఉపన్యసించే ప్రధాని.. సాంత్వన కలిగించాల్సిన సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కాంగ్రెస్‌ తన పనితీరును మార్చుకోవాలని శ్రేణులకు సోనియా స్పష్టమైన సందేశమిచ్చారు. పార్టీ ప్రతి ఒక్కరికీ ఎంతో ఇచ్చిందని.. దాని రుణం తీర్చుకోవాలని.. నేతలు వ్యక్తిగత ఆకాంక్షలను వదులుకుని పార్టీనే మిన్నగా భావించాలని హితవు పలికారు. సమష్టి ప్రయత్నాలతోనే పునరుజ్జీవం సాధ్యమన్నారు. పార్టీకి పూర్వవైభవం తిరిగి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సంకల్పబద్ధులు కావాలని పిలుపిచ్చారు.


ఒక కుటుంబంలో ఒకరికే సీటు

2014 నుంచి వరుస పరాజయాలు, పార్టీ నుంచి నేతల వలసలతో కుదేలైన పార్టీని ప్రక్షాళించి.. కొత్త రూపు తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ చింతన్‌ శిబిర్‌లో సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా సహా దాదాపు 450 మంది నేతలు పాల్గొంటున్నారు.


వీరంతా ఆరు గ్రూపులుగా ఏర్పడి.. ముందుగానే గుర్తించిన ఆరు ప్రధానాంశాలు.. రాజకీయాలు, సామాజిక న్యాయం-సాధికారికత, సంస్థాగత వ్యవహారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులు-రైతు కూలీలు, యువతపై చర్చలకు శ్రీకారం చుట్టారు. ఒక కుటుంబంలో ఒక్కరే ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిబంధనపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ మీడియాకు తెలిపారు. కుటుంబంలో మరొకరు పోటీచేయాలనుకుంటే.. కనీసం ఐదేళ్లు పార్టీలో క్రియాశీలంగా పనిచేసి ఉండాలని చెప్పారు. సోనియాగాంధీ కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ సేవలో ఉన్నందువల్ల వారికి ఈ నిబంధన వర్తించదని చెప్పకనే చెప్పారు. ఈ అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘గత ఐదేళ్లుగా వారు క్రియాశీలంగా ఉన్నారు. ప్రియాంక 2018 నుంచి పార్టీ తరఫున పనిచేస్తున్నారు’ అని మాకెన్‌ బదులిచ్చారు. చింతన్‌ శిబిర్‌ తర్వాత కాంగ్రెస్‌ కచ్చితంగా పరివర్తన చెందుతుందన్నారు.


ప్రతి గ్రూపులోకీ ఎంట్రీ..

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ గ్రూపుల చర్చలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు ముగిశాయి. ప్రతి గ్రూపు భేటీలోనూ సోనియా, రాహుల్‌, ప్రియాంక వంతుల వారీగా పాల్గొనడం గమనార్హం. చర్చలు పూర్తయ్యే వరకూ మీడియాతో మాట్లాడకూడదని ప్రతి ఒక్కరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. అందరూ మాట్లాడిన అంశాలను మినిట్స్‌లో రికార్డు చేస్తున్నారని, శనివారం సాయంత్రం తర్వాత అన్నిటినీ క్రోడీకరించి వాటిని వర్కింగ్‌ కమిటీ ముందు ప్రవేశపెడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అది వాటిపై చర్చించి పార్టీ ప్రక్షాళనకు తీసుకోవలసిన చర్యలను ఖరారు చేస్తుంది. ఆదివారం మఽధ్యాహ్నానికి ఉదయపూర్‌ డిక్లరేషన్‌, వర్కింగ్‌ కమిటీ తీర్మానాలు వెల్లడవుతాయి. ముగింపు సమావేశంలో యువ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.రాజు, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు.


సొంతిల్లు దిద్దుకున్నాక పొత్తులపై చర్చలు: ఖర్గే

సంస్థాగత బలోపేతమే ప్రధాన లక్ష్యమని.. శ్రేణుల్లో ఐకమత్యం తెచ్చి, సొంతిల్లు దిద్దుకున్నాకే ఇతర పార్టీలతో పొత్తులపై చర్చిస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, శిబిర్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ మల్లికార్జున్‌ ఖర్గే చెప్పారు. సొంత పెట్టుబడుల్లేకపోతే చేయి కలపడానికి భాగస్వాములు రారని వ్యాఖ్యానించారు.


వృద్ధులకు సెలవు..!

పార్టీలో సగం పోస్టులు 50 ఏళ్ల వయసులోపు ఉన్న వారికే కేటాయించాలన్న అంశంపై చర్చ జరిగింది. దీనిని ఆమోదిస్తే పార్టీలోని సగం మంది కురువృద్దులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. దేశ జనాభాలో సగం మంది 40 ఏళ్లలోపు వారైనందున పార్టీలో యువతకు అధిక ప్రాతినిధ్యం కల్పించాలని రాహుల్‌ సన్నిహితుడైన పార్టీ నేత మాణిక్కం ఠాగూర్‌ అన్నారు.


మరిన్ని మార్పులు..

ఏ వ్యక్తీ ఒక పదవిలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు. ఆ తర్వాత మరో మూడేళ్లు పనితీరును బట్టి అవకాశం కల్పించవచ్చు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎంపిక ఎన్నికల ఆధారంగా జరుగుతుంది కనుక దీనికి ఐదేళ్ల నిబంధన వర్తించదు.

 పార్టీ బూత్‌ స్థాయికీ, బ్లాకు స్థాయికీ మధ్య మండల శాఖను ఏర్పాటు చేస్తారు. ప్రతి మండలంలోనూ 15-20 బూత్‌లు ఉంటాయి. 3-5 మండ లాలను కలిపి ఒక బ్లాకుగా వ్యవహరిస్తారు.

ప్రతి స్థాయిలోని పదవుల్లో సగం 50 ఏళ్లలోపు వారికి ఇవ్వాలి.

ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి పబ్లిక్‌ ఇన్‌సైట్‌ గ్రూపు ఏర్పాటు చేస్తారు. పార్టీలో ప్రతి స్థాయిలో ఉన్న నేతల పనితీరు విశ్లేషించేందుకు అంచనా కమిటీ ఉంటుంది.


లీకుల భయంతో మొబైల్స్‌పై నిషేధం

చింతన్‌ శిబిర్‌లో జరిగే చర్చలు బయటకు లీకవుతాయన్న భయంతో.. కాంగ్రెస్‌ నాయకత్వం మొబైల్‌ ఫోన్లను నిషేధించింది. అంతర్గతంగా జరిగే చర్చలకు మొబైల్‌ ఫోన్లతో హాజరయ్యేందుకు నేతలను అనుమతించలేదు. ఫోన్లకు లాకర్లను ఏర్పాటు చేశారు. మొబైల్స్‌ను వాటిలో ఉంచాలని సమావేశాలకు ముందే మాకెన్‌ నేతలకు సూచించారు.

Read more