కాంగ్రెస్‌లో మళ్లీ ధిక్కారస్వరం

ABN , First Publish Date - 2021-02-28T09:34:45+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కాంగ్రె‌స్‌లో మళ్లీ అసమ్మతి ధ్వనులు ఊపందుకున్నాయి. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ నిరుడు గళమెత్తిన 23 మంది (జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు జమ్మూలో

కాంగ్రెస్‌లో మళ్లీ ధిక్కారస్వరం

పార్టీ బలహీనం.. కొత్త తరం రావాలి: రెబెల్స్‌

అన్ని ప్రాంతాలూ పార్టీకి ఒక్కటే.. 

రాహుల్‌ వ్యాఖ్యలకు ఆజాద్‌ కౌంటర్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కాంగ్రె‌స్‌లో మళ్లీ అసమ్మతి ధ్వనులు ఊపందుకున్నాయి. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ నిరుడు గళమెత్తిన 23 మంది (జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు జమ్మూలో బలప్రదర్శన చేశారు. పార్టీ పరిస్థితిపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడుతోంది. ఇది నిజం. దీన్ని అంతా అంగీకరించాలి. అందుకే మేం ఇక్కడ సమావేశమయ్యాం. పార్టీ పరిస్థితి మెరుగుపడాలన్నదే మా ఉద్దేశం. మాకు మద్దతిస్తున్న అనేకమంది ఇక్కడకు రాలేదు. పార్టీ బలోపేతం కోసం మేం ఏ త్యాగానికైనా సిద్ధం’’ అని సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబ్బల్‌ అన్నారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో సీనియర్‌ నేత, అసమ్మతివాదుల నాయకుడు గులాంనబీ ఆజాద్‌ ఈ ‘శాంతి సమ్మేళనాన్ని’ ఏర్పాటు చేశారు. కపిల్‌ సిబ్బల్‌తో పాటు భూపిందర్‌సింగ్‌ హూడా, ఆనంద్‌ శర్మ, వివేక్‌ టంకా, మనీశ్‌ తివారీ, రాజ్‌ బబ్బర్‌ సహా ఆనాడు సోనియాకు లేఖ రాసిన మరికొందరు నాయకులు ఒకే వేదికపై పాల్గొని ఇటీవలి పరిణామాలను బహిరంగంగానే చర్చించారు.


‘‘కాంగ్రెస్‌ గత వైభవాన్ని చూశాం. పదేళ్లుగా పార్టీ బలహీనమవుతూ వచ్చింది. ఇంకా బలహీనం కావడాన్ని మేం చూడలేం. మాకు వయసు పైబడుతోంది. ఇక కొత్తతరం పార్టీకి అనుసంధానం కావాలి’’ అని ఆనంద్‌ శర్మ అన్నారు. తమపై విమర్శలు గుప్పిస్తున్న వారికి దీటుగా బదులిస్తూ.. ‘మేం ఏదో ఆషామాషీగా పార్టీలోకి రాలేదు, కొనసాగలేదు. దొడ్డిదారిన వచ్చిన వాళ్లం కాదు. విద్యార్థి, యువ ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్లం. మేం కాంగ్రె్‌సవాదులమా కాదా అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు’’ అని పేర్కొన్నారు. ‘అందరూ మమ్మల్ని జీ-23 అంటున్నారు. నేను దాన్ని గాంధీ-23 అంటాను. మహాత్మాగాంధీ సంకల్పం, ఆలోచనలతో ఈ దేశ రాజ్యాంగం, చట్టాలు రూపుదిద్దుకున్నాయి. కాంగ్రెస్‌ బలంగా ఉండాలని జీ-23 కోరుకుంటోంది’ అని రాజ్‌బబ్బర్‌ అన్నారు. కాగా, ఉత్తర- దక్షిణ భారతావని మధ్య అంతరాన్ని వివరిస్తూ  రాహుల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారాన్ని  ఆజాద్‌ తగ్గించే యత్నం చేశారు. ‘జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌.. దేశంలోని ఏ ప్రాంతమైనా కావొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రాంతాల వారిని సమానంగా గౌరవిస్తుంది’ అని  ఆజాద్‌ వివరణ ఇచ్చారు. విశేషమేమంటే జమ్మూ సమావేశానికి హాజరైనవారంతా ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్‌ నేతలే! గులాం నబీ ఆజాద్‌ ఈ మధ్యే రాజ్యసభ నుంచి రిటైరయ్యారు. ఆయన వీడ్కోలు సమయంలో ప్రధాని ఆయనను ఘనంగా ప్రస్తుతిస్తూ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఇదే తరహా గౌరవం ఆజాద్‌కు సోనియా, రాహుల్‌ల నుంచి లభించలేదు.


గత కొన్నేళ్లుగా ప్రతిసారీ తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ పొత్తు, సీట్ల సర్దుబాటును ఆజాదే చూస్తూ వచ్చారు. విశేషానుభవం ఉన్న ఆజాద్‌ను ఎందుకు పట్టించుకోరని కపిల్‌ సిబ్బల్‌ హైకమాండ్‌ను ప్రశ్నించారు. రెబెల్స్‌ సమావేశంపై స్పందించిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వీ.. ‘‘ఆ నాయకులంటే మాకెంతో గౌరవం. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో అక్కడ సమావేశమయ్యేకంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వెళ్లి పార్టీని బలోపేతం చేసి ఉంటే బాగుండేది’ అని వ్యాఖ్యానించారు. ఆజాద్‌ను పార్టీ విస్మరించలేదన్నారు.


ప్రజాస్వామ్యం చచ్చిపోయింది

వ్యవస్థల మధ్య సమతుల్యతను ఆర్‌ఎ‌స్‌ఎస్‌ దెబ్బతీసింది: రాహుల్‌


తూత్తుకుడి, ఫిబ్రవరి 27: దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘గడిచిన ఆరేళ్లుగా దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, పత్రికా స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛలపై పథకం ప్రకారం దాడి జరుగుతోంది. ప్రజాస్వామ్యం ఒక్క దెబ్బకు చచ్చిపోదు. నెమ్మదిగా అంతరిస్తుంది. పార్లమెంటు, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, మీడియా వీటన్నింటి సమాహారమే దేశం. ఈ వ్యవస్థలన్నింటిలోకీ ఆర్‌ఎ్‌సఎస్‌ చొరబడింది. వాటి మధ్య సమత్యులతను ధ్వంసం చేసింది’’ అని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. మన వ్యవస్థలను కాపాడుకోవాల్సిన సమయమిదని చెప్పారు. ‘‘ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోంది. పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలకు ఎంత డబ్బిచ్చిందో మాకు తెలుసు. భారీగా డబ్బు వెదజల్లి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో మా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొంది’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాలతో మోదీ రాజీపడతారని చైనాకు తెలుసని, సరిహద్దు సమస్య విషయంలో జరుగుతున్న పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడులకు అనుమతులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. 

Updated Date - 2021-02-28T09:34:45+05:30 IST