‘చేయి’ కలిపేందుకు సై

ABN , First Publish Date - 2022-03-12T07:12:46+05:30 IST

కాంగ్రె్‌సతో చేతులు కలిపేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ‘ఒకవేళ కాంగ్రెస్‌ అంగీకరిస్తే.. ..

‘చేయి’ కలిపేందుకు సై

 2024లో కాంగ్రె్‌సతో కలిసి పోటీచేయొచ్చు

 హస్తం పార్టీ తన సామర్థ్యాన్ని కోల్పోతోంది

 అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి: మమత


కోల్‌కతా, మార్చి 11:  కాంగ్రె్‌సతో చేతులు కలిపేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ‘ఒకవేళ కాంగ్రెస్‌ అంగీకరిస్తే.. ఆ పార్టీతో కలిసి 2024 ఎన్నికల్లో మేం పోటీచేయొచ్చు’ అని శుక్రవారం మీడియా ఎదుట చెప్పారు. కాంగ్రెస్‌ కోరుకుంటే ఆపార్టీతో ‘కూటమి’ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. బీజేపీని ఓడించాలనుకునే పార్టీలన్నీ కలిసిరావాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే.. బీజేపీతో తలపడేందుకు తమతో కలిసిరావాలని కాంగ్రె్‌సను తృణమూల్‌ ఆహ్వానించడం విశేషం. కాంగ్రె్‌సతో కలిపి పనిచేయొచ్చంటూనే ఆ పార్టీ బలహీనపడుతోందని ఆమె ఆక్షేపించారు. ‘కాంగ్రెస్‌ మీద మేం ఆధారపడితే ఫలితం ఉండదు. ఆ పార్టీ తన శక్తిని కోల్పోతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా పనిచేయాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఉత్తరప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయాలపై మమత అనుమానాలను వ్యక్తంచేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు.. ప్రజా తీర్పును ప్రతిఫలింపచేయలేదని వ్యాఖానించారు. ఎన్నికల యంత్రాంగం, కేంద్ర బలగాలు, ఇతర ఏజెన్సీల సాయంతోనే బీజేపీకి విజయం లభించిందని ఆమె ఆరోపించారు. అఖిలేశ్‌ యాదవ్‌ను ఓడించేలా చేశారేకాని, ప్రజా తీర్పుతో ఆయన ఓటమిపాలవ్వలేదని భావిస్తున్నానని చెప్పారు. జరిగినదానికి అఖిలేశ్‌ కుంగిపోకుండా జనంలోకి వెళ్లి.. ఈవీఎంల బాగోతాలను వివరించాలని ఆమె సూచించారు. ఓటర్లు వినియోగించిన ఈవీఎంలనే కౌంటింగ్‌  కేంద్రాలకు తీసుకువెళ్లారా? లేదా? అని తేలాలంటే అన్నింటినీ ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించాల్సిందేనని  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-03-12T07:12:46+05:30 IST