ఒప్పందం ఒట్టి మాటేనా..?

ABN , First Publish Date - 2022-02-09T17:29:07+05:30 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిషత్‌ అధ్యక్ష పదవి ఒప్పదం కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఆ పదవికి ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు

ఒప్పందం ఒట్టి మాటేనా..?

ఎంపీపీ ఎన్నికప్పుడు ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీటీసీల మధ్య తీవ్ర పోటీ

పెద్దల జోక్యంతో చెరి రెండున్నరేళ్లకు సర్దుబాటు 

ఒప్పందం ప్రకారం పదవి ఇవ్వాల్సిందే అంటున్న ఎంపీటీసీ 

రెండున్నరేళ్లు దాటినా సర్దుబాటులో కాంగ్రెస్‌ జాప్యం

పార్టీలో ముదురుతున్న ముసలం


హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిషత్‌ అధ్యక్ష పదవి ఒప్పదం కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఆ పదవికి ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు పోటీపడ్డారు. పార్టీకి విధేయుడిగా పని చేస్తున్న తమకే పదవి కట్టబెట్టాలని ఆ ఇద్దరు ఎక్కడ కూడా తగ్గలేదు. దాంతో పంచాయితీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పెద్దల వరకు వెళ్లింది. రంగంలోకి దిగిన ఆ పార్టీ పెద్దలు ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. అయిన వినకపోవడంతో చెరి రెండున్నరేళ్లు ఎంపీపీ పదవి భాద్యతలు చేపట్టేలా ఒప్పంద పత్రం రాయించారు. జనవరి నెలతో రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ పదవి పంచాయితీ తిరిగి మొదలైంది. ఒప్పందం ప్రకారం తనకు బాధ్యతలను అప్పగించాలని ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్‌ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ బాధ్యతలను వదులుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దాంతో మండలంలో ఎక్కడ చూసినా ఎంపీపీ మార్పు ఉంటుందా..లేదా అన్న చర్చ సాగుతుంది. 


మార్పు తప్పదా...?

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 గ్రామాలతో కలిపి అబ్దుల్లాపూర్‌మెట్‌ను మండలంగా ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో మండల పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 6 ఎంపీటీసీ, టీఆర్‌ఎస్‌ 5 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఎంపీపీ స్థానానికి అవసరమైన మెజార్టీ స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వుడ్‌ కావడంతో పదవి కోసం ఆ పార్టీలో పోటీ ఎక్కువైంది. కుత్బుల్లాపూర్‌ నుంచి గెలిచిన ఎంపీటీసీ భీమగోని భాస్కర్‌గౌడ్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌-1 నుంచి గెలుపొందిన బుర్ర రేఖామహేందర్‌గౌడ్‌ ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. తనకే ఎంపీపీ పదవి కావాలని ఇద్దరు సభ్యులూ పట్టుబట్టారు. దాంతో కాంగ్రెస్‌ పెద్దలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఇతర నేతలు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరూ తగ్గకపోవడంతో చెరి రెండున్నరేళ్లు ఎంపీపీగా కొనసాగేలా  ఒప్పందం కుదుర్చారు. ముందుగా బుర్ర రేఖామహేందర్‌గౌడ్‌ రెండున్నరేళ్లు ఎంపీపీగా కొనసాగుతారని, మిగతా రెండున్నరేళ్లు కుత్బుల్లాపూర్‌ ఎంపీటీసీ భాస్కర్‌గౌడ్‌ ఎంపీపీగా ఉంటారని పెద్దలు సర్దిచెప్పి పంచాయితీకి పుల్‌స్టాప్‌ పెట్టారు. 


అనంతరం జూలైలో ఎంపీపీగా బుర్ర రేఖామహేందర్‌గౌడ్‌ బాధ్యతలను చేపట్టారు. గత నెల జనవరితో రేఖామహేందర్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి అయింది. దాంతో కుత్బుల్లాపూర్‌ ఎంపీటీసీ ఒప్పందం ప్రకారం తనకు ఎంపీపీ బాధ్యతలను అప్పగించాలని ప్రస్తుత ఎంపీపీని కోరినట్లు సమాచారం. దాంతో పదవిని వదులుకునేందుకు రేఖ విముకత వ్యక్తం చేయడంతో భాస్కర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను ఆశ్రయించినట్లు తెలిసింది. వారం పది రోజుల క్రితం మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసిన భాస్కర్‌గౌడ్‌ తన ఆవేదన వ్యక్త పరిచినట్లు సమాచారం. పదవి ఇప్పించడంలో పెద్దల జాప్యంపై ఓ వర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఎంపీపీ ఒప్పంద పంచాయితీ మల్‌రెడ్డి బ్రదర్స్‌కు తలనొప్పిగా మారిందని పలువురు కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం ఎంపీపీ పదవిని భాస్కర్‌గౌడ్‌కు ఇప్పిస్తారా లేక రేఖా మహేందర్‌గౌడ్‌నే కొనసాగిస్తారా అనేది మండలంలో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ పంచాయితీకి పుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 


కొంపముంచుతున్న వర్గ పోరు

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. మండల పరిషత్‌ ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా, పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అత్యధిక కౌన్సిలర్‌ స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది. అయితే ఎంపీపీ అధ్యక్ష పదవికి పార్టీలోనే పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ, మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్‌ స్థానాలు గెలిచి కూడా వైస్‌ చైర్మన్‌ పదవి కోసం పాకుటాలలో చైర్మన్‌ స్థానాన్ని చేతులారా పోగొట్టుకుంది. అయితే ప్రస్తుతం ఎంపీపీ పదవి కోసం జరుగుతున్న పంచాయితీలో పెద్దల నిర్ణయాన్ని బట్టి పార్టీలో చీలికలు బయటపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇలాగే గ్రూపుల పోరు కొనసాగితే రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పలువురు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొంటున్నారు.  

Updated Date - 2022-02-09T17:29:07+05:30 IST