కమీషన్ల కోసమే కేఎల్‌ఐని ముంచారు

ABN , First Publish Date - 2020-10-18T10:32:42+05:30 IST

కమీషన్ల కోసం కక్కుర్తి పడి సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

కమీషన్ల కోసమే కేఎల్‌ఐని ముంచారు

నిర్వహణ లోపం వల్లే ప్రాజెక్టుల్లో ప్రమాదాలు: రేవంత్‌


నాగర్‌కర్నూల్‌/తెలకపల్లి/హైదరాబాద్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కమీషన్ల కోసం కక్కుర్తి పడి సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టును సందర్శించేందుకు బయల్దేరిన ఆయనను నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో జరిగిన తోపులాటలో రేవంత్‌ కాలుకు గాయమైంది. ఆయనను ఉప్పునుంతల స్టేషన్‌కు తరలించిన పోలీసులు అక్కడే చికిత్స చేయించారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు అనుకూలమైన కంపెనీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కట్టబెట్టి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు ద్వారా కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్లను దండుకుంటోందని విమర్శించారు. నిర్వహణను పట్టించుకోనందుకే శ్రీశైలం పవర్‌హౌస్‌, కల్వకుర్తి లిఫ్టులో ప్రమాదాలు జరిగాయని ఆరోపించారు.


కల్వకుర్తి లిఫ్టు మునకపై హైకోర్టు సిటింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాగా పంప్‌హౌస్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేఎల్‌ఐ ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని, 2016లో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-18T10:32:42+05:30 IST