భట్టి పాదయాత్రపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-28T19:54:59+05:30 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టి పాదయాత్రపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

భట్టి పాదయాత్రపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టి పాదయాత్రపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌తో కోమటిరెడ్డి మాట్లాడుతూ... కష్టమైనా నష్టమైనా పాదయాత్రను కొనసాగించాలని భట్టిని కోరారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలని భట్టికి సూచన చేశారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు భట్టి విక్రమార్కకు అనుమతి ఇవ్వాలని సోనియా, రాహుల్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. 2004లో సీఎల్పీ నేతగా రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎంపీ గుర్తుచేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే కావాల్సిన సహకారం సీనియర్లం అందిస్తామన్నారు. ‘‘నేను అంటే గోవిందా అని.. కాంగ్రెస్‌లో నేను అనే పదానికి చోటు లేదు.. మనం అని మాత్రమే అనాలి’’ చెప్పుకొచ్చారు. రాహుల్ సభకు ఒక వ్యక్తి మాత్రమే లక్షల మందిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.


ఉమ్మడి కృషితో వరంగల్‌లో రాహుల్ సభను విజయవంతం చేస్తామని తెలిపారు. బలమైన నల్లగొండలో కాదు.. బలహీనంగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో సన్నాహక సమావేశాలు పెట్టాలని హితవుపలికారు. నితిన్ గడ్కరీ పర్యటన కారణంగా.. రేపు నల్లగొండ కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి హాజరుకావటం‌ లేదని తెలిపారు. 3 వేల‌ కోట్లతో మూసీని శుభ్రం చేయలేని అసమర్థ సీఎం‌ కేసీఆర్ అని విమర్శించారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి అభివృద్ధిలో తన కృషి ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. 


Updated Date - 2022-04-28T19:54:59+05:30 IST