రూ. 87 కోట్ల అదనపు ఆస్తి ఎలా వచ్చిందో చెప్పండి..?

ABN , First Publish Date - 2022-07-12T16:21:52+05:30 IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌కు ఏసీబీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల దాడిలో లభ్యమైన రూ.87 కోట్ల అదనపు ఆస్తి ఎలా

రూ. 87 కోట్ల అదనపు ఆస్తి ఎలా వచ్చిందో చెప్పండి..?

                      - Congress Mla Jameerకు ఏసీబీ ప్రశ్న


బెంగళూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌కు ఏసీబీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల దాడిలో లభ్యమైన రూ.87 కోట్ల అదనపు ఆస్తి ఎలా వచ్చిందో ఆధారాలు సమర్పించాలని సూచించారు. దాడి జరిగిన మూడోరోజే కార్యాలయానికి వచ్చి ఆధారాలు చూపాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. బక్రీద్‌ పండుగ ఉన్నందున కొన్నిరోజులు గడువు కావాలని జమీర్‌ అహ్మద్‌ కోరారు. ప్రస్తుతం బక్రీద్‌ ముగియడంతో ఆధారాలతో హాజరు కావాలని సూచించారు. జమీర్‌ అహ్మద్‌ ఆదాయానికంటే ఎక్కువ ఆస్తులు సంపాదించారని ఏసీబీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమర్పించిన నివేదిక సూచించింది. ఇందుకు అనుగుణంగా ఏసీబీ అధికారులు ఇటీవల ఆయన నివాసంపై దాడి చేశారు. రూ.87.44 కోట్లు అక్రమ ఆస్తి కల్గినట్టు ఇప్పటికే ఈడీ గుర్తించింది. కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ బంబూబజార్‌లో ఉండే జమీర్‌ ఇల్లు, సదాశివనగర్‌లోని గెస్ట్‌హౌస్‌, కలాసిపాళ్యలోని నేషనల్‌ ట్రావెల్స్‌ ఆఫీస్‌, ఓకా అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌, బనశంకరిలోని జీకే అసోసియేట్స్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఐఎంఏ కుంభకోణం కేసును విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అప్పట్లోనే ఎమ్మెల్యే ఆస్తులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. 16 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జమీర్‌ అహ్మద్‌ ఏ వి ధంగా సంపాదించారనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. 2006 ఉప ఎన్నికల్లో చామరాజపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2006 ఎన్నికలవేళ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత వరుసగా ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించారు. నేషనల్‌ ట్రావెల్స్‌ ఏజెన్సీ, రియల్‌ ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఆయన శ్రీమంతులలో ఒకరిగా పేరొందారు. దాడి జరిపిన సమయంలో ఆస్తులకు సంబంధించి ఆడిటర్లు ఏసీబీ అధికారులకు రికార్డులు సమర్పించారు. కానీ ఏసీబీ ప్రత్యేకంగా ఆడిటర్ల ద్వారా పరిశీలన జరిపించి వివరాలు ఇవ్వాలని కోరింది. 

Updated Date - 2022-07-12T16:21:52+05:30 IST