సోనియా మీటింగ్‌లో రాహుల్ కోసం ఎంపీల పట్టు..

ABN , First Publish Date - 2020-07-12T01:25:41+05:30 IST

రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు డిమాండ్ చేశారు. దేశంలోని తాజా..

సోనియా మీటింగ్‌లో రాహుల్ కోసం ఎంపీల పట్టు..

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు డిమాండ్ చేశారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు పార్టీ  ఎంపీలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు తమ విజ్ఞాపనను సోనియాగాంధీ ముందుంచారు.


రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కోరిన వారిలో కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్, ఎ.ఆంటోనీ, మాణిక్యం ఠాగూర్ (తమిళనాడు), గౌరవ్ గొగోయ్, అబ్దుల్ ఖలేక్ (అసోం), మొహమ్మద్ జావెద్ (బీహార్), సప్తగిరి శంకర్ ఉలేకా (ఒడిశా) తదితరులు ఉన్నారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ సైతం ఈ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే, తనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని ఎంపీలు చేసిన డిమాండ్‌కు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


కాగా, గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సైతం శనివారంనాడు ఇదే తరహా డిమాండ్ చేశారు. పార్టీకి రాహుల్ తిరిగి సారథ్యం వహించాలని, పార్టీలోని చిన్నా, పెద్దా అంతా ఆయనకు బాసటగా ఉండేందుకు, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తనంత తానుగా తప్పుకున్నారు.

Updated Date - 2020-07-12T01:25:41+05:30 IST