గోవాలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్: ఒపీనియన్ పోల్

ABN , First Publish Date - 2022-01-31T00:42:09+05:30 IST

గోవాలో అధికారాన్ని నిలుపుకోవాలనే బీజేపీ ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ గండి కొట్టే..

గోవాలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్: ఒపీనియన్ పోల్

పనజి: గోవాలో అధికారాన్ని నిలుపుకోవాలనే బీజేపీ ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ గండి కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఇండియా టీవీ క్షేత్రస్థాయి ఒపీనియన్ పోల్ ప్రకారం, గోవాలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 21 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 14 నుంచి 18 సీట్లు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్ జోస్యం చెప్పింది. టీఎంసీ-ఎంజీపీ కూటమి 2 నుంచి 4 సీట్లు, ఆప్‌కు జీరో నుంచి 2 సీట్లు వస్తాయని,  ఇతరులు ఒక సీటు గెలుచుకుంటారని పేర్కొంది. ఓట్ల షేర్ ప్రకారం బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్‌కు 32 శాతం, టీఎంసీ-ఎంజీపీకి 12 శాతం, ఆప్ 10 శాతం, ఇతరులు 12 శాతం రావచ్చని తెలిపింది.


ఒపీనియన్ పోల్ ప్రకారం సౌతో గోవాలో కాంగ్రెస్ బాగా లాభపడుతుంది. కాంగ్రెస్-జీఎఫ్‌పీ 41 శాతం ఓటింగ్ షేర్ రాబట్టుకుంటాయి. బీజేపీకి 32 శాతం ఓట్ల షేర్ రావచ్చు. సీట్ల పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లు, బీజేపీ 6 నుంచి 8 సీట్లు, టీఎంసీ-ఎంజీపీ 1 నుంచి 2, ఆప్ జీరో నుంచి 2 సీట్లు వస్తాయి. ఇతరులు ఖాతా కూడా తెరవకపోవచ్చు.


మనోహర్ పారికర్ ప్రభుత్వంలో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న జీఎఫ్‌పీ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంది. శివసేనతో గతంలో కలిసి పనిచేసిన ఎంజీపీ ఈసారి టీఎంసీతో పొత్తు పెట్టుకుంది. కాగా, 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 13 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 17 సీట్లు  గెలుచుకుంది. అయితే, ముగ్గురు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జీఎఫ్‌పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక ఎన్‌సీపీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ముందుకు వచ్చింది. 2019లో పారికర్ మృతితో స్పీకర్ ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి అయ్యారు.  

Updated Date - 2022-01-31T00:42:09+05:30 IST