కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్

ABN , First Publish Date - 2021-11-24T00:49:55+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ (62) కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని..

కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ (62) కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆజాద్, హర్యానా పీసీసీ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ (45) పార్టీ కండువాలు కప్పుకున్నారు.


మమత వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఆ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఇప్పుడు సరైన మార్గంలో నడిపించే నేత కావాలని అన్నారు. అందుకు సరైన వ్యక్తి మమతేనని, అందుకే ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. 


బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ బీహార్‌లోని దర్భంగా నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అక్రమాలకు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీనే కారణమని ఆరోపించిన కారణంగా 2015లో కీర్తి ఆజాద్ బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా పనిచేసిన అశోక్ తన్వర్ కూడా సిర్సా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో కాంగ్రెస్‌ను వీడారు. అశోక్ తన్వర్ టీఎంసీలో చేరిన అనంతరం మమత మాట్లాడుతూ.. బీజేపీని ఓడించాలన్న ఆయన నిర్ణయంపై మమత హర్షం వ్యక్తం చేశారు. అశోక్ పిలిచిన వెంటనే తాను హర్యానా వెళ్తానని పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-24T00:49:55+05:30 IST