కాంగ్రెస్ నేతలు వారిలో వారే కొట్టుకుంటున్నారు.. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?: భగవంత్ మాన్

ABN , First Publish Date - 2022-01-19T00:17:14+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ నేతలు వారిలో వారే కొట్టుకుంటున్నారని, ఇక ప్రభుత్వాన్ని ఎలా

కాంగ్రెస్ నేతలు వారిలో వారే కొట్టుకుంటున్నారు.. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?: భగవంత్ మాన్

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ నేతలు వారిలో వారే కొట్టుకుంటున్నారని, ఇక ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అన్నారు. సంగ్రూర్ ఎంపీ అయిన భగవంత్‌ మాన్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రకటించారు.


మీ ముఖ్యమంత్రిని మీరే ఎన్నుకోండంటూ ఆప్ ఇటీవల ఓ ఫోన్ నంబరును ప్రకటించగా, ప్రజలు పెద్ద ఎత్తున తమ స్పందన తెలియజేశారు. ఇలా తమ అభిప్రాయాలను తెలియజేసిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు భగవంత్ మాన్‌కే ఓటేశారు.  


తాజాగా ‘ఇండియా టుడే’తో మాట్లాడిన భగవంత్ మాన్.. ప్రజలు తనపై నమ్మకం ఉంచడం చాలా పెద్ద విషయమని, దీనిని తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో తన బాధ్యత రెట్టింపు అయిందన్నారు. పంజాబ్ ప్రజలు ‘ఆప్‌పై విశ్వాసముంచారని, తాము ఎక్కడికి వెళ్లినా మీరు అధికారంలోకి వస్తారని, అంతా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పారని గుర్తు చేసుకున్నారు.


అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు మాన్ స్పందిస్తూ.. పంజాబ్ ఒకప్పుడు ఇండియాలోనే అగ్రస్థానంలో ఉండేదని, ఇప్పుడు 26, 27 స్థానాలకు పడిపోయిందని అన్నారు. గత పదేళ్లలో అకాలీదళ్-బీజేపీ, అకాలీదళ్-కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని విమర్శించారు.


మాఫియా రాజ్ రాజ్యమేలుతోందని, ఎలాంటి ఆశలు లేని యువత కెనడా, న్యూజిలాండ్ వెళ్లిపోతున్నారని అన్నారు. యువతలో ఇప్పుడు ఆప్ కొత్త ఆశలు చిగురింపజేసిందన్నారు. తాము పనిచేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అత్యుత్తమ స్కూళ్లు, ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మనది సరిహద్దు రాష్ట్రం కావడంతో బలమైన ప్రభుత్వం అవసరమని భగవంత్ మాన్ అన్నారు.  

Updated Date - 2022-01-19T00:17:14+05:30 IST